ముంబయి: ఇరు జట్ల మధ్య వివాదాలను నిరోధించడానికి ముక్కోణపు వన్డేల్లో భాగంగా జరిగే ఫైనల్ మ్యాచుల్లో ఉద్వేగాలను దుపు చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధికారులు భారత ఆటగాళ్లకు సూచించింది. మైదానంలో వాగ్వివాదాలను తాము ఇష్టపడడం లేదని బిసిసిఐ కార్యదర్శి నిరంజన్ షా మంగళవారం చెప్పారు. ఎవరికైనా సమస్య ఎదురైతే అంపైర్ల దగ్గరికి, మ్యాచ్ రెఫరీ దగ్గరికీ లేదా జట్టు మేనేజర్ దగ్గరికి వెళ్లి చెప్పాలని ఆయన సూచించారు.
ముక్కోణపు వన్డేలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్ కు, భారత బౌలర్ ఇషాంత్ శర్మకు మధ్య తాజాగా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. తాము క్రీడాస్ఫూర్తితో ఆడుతున్నప్పటికీ ఆస్ట్రేలియా క్రీడాకారులు కొంతమంది ఆటలో సామరస్యాన్ని దెబ్బ తీయడానికి వ్యాఖ్యలు చేస్తున్నారని భారత్ ఫిర్యాదు చేసింది. హర్బజన్ వివాదం అందరికీ తెలిసిందే.