వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు త్రుటిలో మెడల్ చేజార్చుకుంది. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన భారత బృందం ఐదో స్థానంలో రేస్ ముగించింది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌లో భారత బృందం 2:59.92 సెకన్లలో రేసు ముగించింది. శనివారం జరిగిన సెమీఫైనల్ హీట్స్-1లో అదరగొట్టిన ఈ బృందం.. ఫైనల్‌లో మెడల్ ఆశలు రేపింది. కానీ చివరి మెట్టుపై తడబడి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ రేసులో యూఎస్‌ఏ బృందం గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ టీం కేవలం 2:57.31 సెకన్లలో రేస్ ముగించడం గమనార్హం. ఇక రెండో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ టీం కూడా 2:58.45 సెకన్లలో రేస్ పూర్తి చేసింది. ఇది ఆ దేశ చరిత్రలోనే టాప్ రికార్డు కావడం గమనార్హం. ఈ రేస్‌ను 2:58.71 సెకన్లలో ముగించిన బ్రిటన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం తన సెమీఫైనల్ రికార్డును కూడా బీట్ చేయలేకపోవడం గమనార్హం.

మహమ్మద్ అనాజ్, అమోజ్ జాకబ్, మహమ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్‌తో కూడిన ఈ బృందం.. ఈ విభాగంలో టాప్ దేశాల సరసన నిలిచిందని మాత్రం మర్చిపోకూడదు. సెమీఫైనల్ రేస్ అనంతరం భారత బృందంలో రమేష్ కనీసం నడవలేకపోయాడు. దీంతో అతన్ని వీల్‌చైర్‌లో స్టేడియం నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది కూడా భారత బృందం పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
సెమీఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత్.. ఫైనల్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తుందని అంతా ఆశించారు. కానీ అలా జరగకపోవడం నిరాశ కలిగించింది. అయితే భారత బృందం చూపిన తెగువను మాత్రం భారతావని మెచ్చుకుంటోంది. వారికి మద్దతుగా నిలుస్తూ.. తదుపరి రేసులో కచ్చితంగా మెడల్ కొడతారంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. సెమీస్‌లో రేస్‌ను కేవలం 2:59.05 సెకన్లలో పూర్తి చేసిన భారత్.. అత్యంత వేగంగా ముగించిన ఆసియా జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.