హైదరాబాద్: భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి చదలవాడ ఆనంద సుందరరామన్ (సీఏ) భవానీ దేవి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలిచిన భారత తొలి ఫెన్సర్‌గా భవాని దేవి రికార్డు సాధించింది. ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్‌లో జరిగిన టర్నోయ్ సాటిలైట్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది.
శనివారం జరిగిన సాబెర్ ఈవెంట్ ఫైనల్లో భవాని 15-13 పాయింట్ల తేడాతో జేన్ హాంప్సన్ (బ్రిటన్)ను ఓడించింది. అంతకముందు జరిగిన సెమీస్‌లో భవాని 15-11తో బ్రిటన్‌కే చెందిన జెస్సికా కోర్బీని ఓడించింది. ప్రస్తుతం థలస్సేరి 'సాయ్' సెంటర్‌లో భవాని శిక్షణ తీసుకుంటోంది.

'ఈ టోర్నీలో నేను మూడోసారి పాల్గొన్నాను. గతంలో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ దశ దాటలేదు. ఈసారి మాత్రం స్వర్ణం సాధించాను. ప్రపంచస్థాయి టోర్నీలో నాకిదే తొలి పతకం. గతంలో నేను ఆసియా, కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలిచాను' అని చెప్పింది.
ఫెన్సింగ్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిన భవానీ దేవికి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు తెలిపాడు.