న్యూఢిల్లీ: చైనా రాయబార కార్యాలయ సిబ్బంది చేసిన తప్పుకు ఇద్దరు భారత అర్చరీ తమ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా రాయబార కార్యాలయ సిబ్బంది స్టేపుల్డ్ వీసాలు జారీ చేయడంతో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణిలు గ్వంగ్స్యూకు వెళ్లే చైనా విమానంలో ప్రయాణించేందుకు అనుమతి లభించలేదు.
చైనాలో జరిగే యూత్ వరల్డ్ అర్చరీ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనాల్సిన క్రీడాకారులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తర్వాత చైనాకు వెళ్లే విమానంలోకి చైనా విమానయాన అధికారులు స్టేపుల్డ్ వీసాల కారణంగా అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 24మంది గల భారత అర్చరీ బృందంలో మిహు మసెలో, యూమి సొరంగ్‌లు అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

భారత అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు వికె మల్హోత్రా మాట్లాడుతూ.. చైనా రాయబార కార్యాలయ సిబ్బంది ఇచ్చిన స్టేబుల్డ్ వీసాల కారణంగా ఇద్దరు క్రీడాకారిణులను చైనా విమానంలో ప్రయాణించేందుకు ఆ విమానయాన అధికారులు అనుమతించలేదని తెలిపారు. ఇద్దరు క్రీడాకారులు చైనా విమానంలో ప్రయాణించడానికి వీల్లేదని అధికారులు తెలిపినట్లు చెప్పారు.
విమానంలో ప్రయాణించేందుకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ చైనా అధికారులు ఒక్క స్టేపుల్డ్ వీసాల కారణంగా ఇద్దరు అర్చరీ క్రీడాకారులు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనలేకపోతున్నారని భారత అర్చరీ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ గుంజన్ ఎబ్రోల్ అన్నారు. మంచి భవిష్యత్ ఉన్న ఇద్దరు యువ క్రీడాకారిణిలు చైనా సిబ్బంది చేసిన తప్పుకు బలికావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ పరిణామంతో క్రీడాకారిణిలు చాలా ఆవేదనకు గురయ్యారని చెప్పారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్చరీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కిరెన్ రిజిజి డిమాండ్ చేశారు.