
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 ఆర్చరీ మెన్స్ సింగిల్స్‌లో వెటరన్ ప్లేయర్ తరుణ్‌దీప్ రాయ్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన రౌండ్ ఆఫ్ 32లో గెలిచి పతకం ఆశలు రేపిన రాయ్.. రౌండ్ ఆఫ్ 16లో పోరాడి ఓడిపోయాడు. షూట్ ఆఫ్ ద్వారా విజేతను తేల్చిన ఈ రౌండ్‌లో 5-6 తేడాతో ఇజ్రాయెల్ ఆర్చర్ ఇతాయ్ షానీ చేతిలో తరుణ్‌దీప్ రాయ్ పరాజయం పాలయ్యాడు. నెపార్తక్ తుపాను కారణంగా టోక్యో నగరంలో ప్రస్తుతం బలమైన గాలులు వీస్తున్నాయి. యుమెనోషిమా పార్క్ వద్ద గాలులతో కూడిన పరిస్థితులలో ఆర్చరీ మెన్స్ సింగిల్స్ పోటీలు జరిగాయి.
ఐదు సెట్లు ముగిసే సమయానికి తరుణ్‌దీప్ రాయ్, ఇతాయ్ షానీ చెరో ఐదు పాయింట్లతో సమంగా నిలిచారు. రెండు, నాలుగు సెట్లను తరుణ్‌దీప్ గెలవగా.. తొలి, ఐదో సెట్‌లను ఇతాయ్ గెలిచాడు. ఇక మూడో సెట్‌లో ఇద్దరికీ ఒక్కో పాయింట్ వచ్చింది. దీంతో షూట్ ఆఫ్ తప్పలేదు. ఇందులో ఇతాయ్ పర్ఫెక్ట్ 10 సాధించగా.. తరుణ్ 9 స్కోరు మాత్రమే చేయగలిగాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్ 2021 తరుణ్‌దీప్ రాయ్ పోరాటం ముగిసింది.
అంతకుముందు రౌండ్ ఆఫ్ 32లో ఉక్రెయిన్‌కు చెందిన హన్‌బిన్ ఒలెక్సీపై 6-4 తేడాతో తరుణ్‌దీప్ రాయ్ విజయం సాధించాడు. మూడు సెట్లు ముగిసే సమయానికి 2-4తో తరుణ్‌దీప్ వెనుకబడినా.. తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టాడు. చివరి సెట్‌లో రెండు పర్ఫెక్ట్ 10లతో తరుణ్‌దీప్ ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.