
టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో 11వ రోజు భారత్.. పరాజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ అడుగు తడబడింది. సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. వ్యక్తిగతంగా తన కేరీర్ బెస్ట్ టైమింగ్‌ను సాధించినప్పటికీ.. అది సరిపోలేదు. సెమీ ఫైనల్స్‌కు చేరడానికి హెల్ప్ కాలేదు. 100 మీటర్ల హీట్‌లో ఇప్పటికే ద్యుతీచంద్ వెనుకంజ వేశారు. ఇక 200 మీటర్ల హీట్‌లోనూ ఆమె అదే ఫలితాన్ని పునరావృతం చేశారు.
టోక్యో ఒలింపిక్స్ స్టేడియంలోని ట్రాక్ 2పై భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:24 నిమిషాలకు మహిళల 200 మీటర్ల రౌండ్ 1 హీట్ 4 ప్రారంభమైంది. ట్రాక్‌పై ఏడో నంబర్ లేన్‌ను కేటాయించారు ద్యుతీచంద్‌కు. హీట్ ప్రారంభమైన వెంటనే లక్ష్యం వైపు స్ప్రింటర్లు మెరుపు వేగంతో దూసుకెళ్లారు. నమీబియాకు చెందిన క్రిస్టీనా ఎంబోమా-22:11, అమెరికా స్ప్రింటర్ గాబ్రిలె థామస్-22:20, నైజీరియా అమినాటోవో సెయినీ-22:72 తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ ముగ్గురూ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
జాంబియా స్ప్రింటర్ రోడా- 23:33, జర్మీనికి చెందిన జెస్సికా-బ్లాంకా వెస్సోల్లి- 23:41, బ్రెజిల్ స్ప్రింటర్ విటోరియా క్రిస్టీనా రోసా-23:59 టైమింగ్‌తో ఆ తరువాతి స్థానాలను ఆక్రమించారు. 23:85 టైమింగ్‌తో భారత స్ప్రింటర్ ద్యుతీచంద్ ఏడో స్థానంలో నిలిచారు. ఇది ఆమె కేరీర్ బెస్ట్ టైమింగ్. సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఒకటిన్నర సెకెను వ్యవధిలో ద్యుతీచంద్ సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయారు.
నాలుగు రోజుల కిందట మహిళల 100 మీటర్ల హీట్‌లో కూడా ద్యుతీచంద్ చేదు ఫలితాన్నే చవి చూసిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో కూడా ఆమె ఏడో స్థానంలోనే నిలిచారు. ఇప్పుడు కూడా అదే స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వంద మీటర్ల హీట్‌ను ద్యుతీచంద్ 11:54 సెకెన్ల వ్యవధిలో పూర్తి చేశారు. దీనితో రన్నింగ్ రేస్‌లో మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల ట్రాక్ మీది నుంచి భారత్ తప్పుకొన్నట్టయింది.