
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో 12వ రోజు భారత జట్టు వరుస పరాజయాలను చవి చూసింది. పతకాన్ని ఆశించదగ్గ ఈవెంట్‌లోనూ ముందడుగు వేయలేకపోయింది. జావెలిన్ థ్రోతో ఆరంభమైన ఈ అపజయాల పరంపరకు ఫస్ట్ హాఫ్‌లో అడ్డుకట్ట పడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుషుల హాకీ జట్టు కూడా నిరాశ పరిచింది. సెమీ ఫైనల్‌లో బెల్జియం చేతిలో ఓడిపోయింది. ఫైనల్స్‌కు చేరకుండానే ముగిసింది ఆ టీమ్ ప్రస్థానం. అయినప్పటికీ- పతకాన్ని ముద్దాడటానికి అవకాశం మాత్రం ఉంది మన్‌ప్రీత్ సింగ్ టీమ్‌కు.
మూడో స్థానం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాంస్యం కోసం ఆస్ట్రేలియా లేదా జర్మనీని ఢీ కొంటుంది. అదే సమయంలో రెజ్లింగ్‌లోనూ భారత్ తిరుగుముఖం పట్టింది. మహిళల 62 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 1/8 రౌండ్‌లో భారత రెజ్లర్ సోనమ్ మలిక్ ఓడిపోయారు. తన ప్రత్యర్థి, మంగోలియాకు చెందిన బొలొర్టుయా ఖురెల్ఖూ చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ రౌండ్ టై అయినప్పటికీ.. భారత్‌కు మాత్రం ఓటమి తప్పలేదు. భారత్‌పై సాధించిన ఓ విజయంతో బొలొర్టుయా ఖురెల్ఖూ ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
రౌండ్‌లో సమానంగా పాయింట్లను సాధించగలిగితే- విన్నర్‌ను ఎంపిక చేయడానికి కొన్ని నిబంధనలను రూపొందించింది.. ఒలింపిక్స్ కమిటీ. దీని ఆధారంగా ఖురెల్ఖూను విజయం సాధించినట్లు ప్రకటించారు అంపైర్లు. తొలి రెండు రౌండ్లలో సోనమ్ మలిక్ ఒక్కొక్క పాయింట్లను సాధించారు. తన ప్రత్యర్థిని మ్యాట్ సర్కిల్ నుంచి బయటికి విసిరేయడం ద్వారా మొదటి, రెండో రౌండ్‌లో ఒక్కొక్క పాయింట్‌ను తన ఖాతాలో వేసుకోగలిగారు.
మ్యాచ్ ముగియడానికి కొన్ని సెకెండ్ల వరకు కూడా ఆమె ఆధిక్యంలోనే కనిపించారు. చివరి నిమిషంలో ఖురెల్ఖూ రెచ్చిపోయారు. మెరుపులా కదిలారు. కొన్ని సెకెండ్ల వ్యవధిలోనే సోనమ్‌పై అనూహ్యంగా పైచేయిని సాధించారు. తాను కూడా రెండు పాయింట్లను సాధించారు. స్కోర్‌ను 2-2తో సమం చేశారు. స్కోర్ సమం అయిన నేపథ్యంలో టచ్‌డౌన్ ఆధారంగా విన్నర్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుందనేది ఒలింపిక్స్ కమిటీ నిబంధన. దీని ఆధారంగా ఖురెల్ఖూను విజేతగా ప్రకటించారు అంపైర్లు. సోనమ్ మలిక్ ఒలింపిక్స్ ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదు. ఆమె రీపేఛేజ్‌లో పాల్గొనాల్సి ఉంది.