
హైదరాబాద్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక 'డైమండ్ లీగ్ ఫైనల్' టోర్నీకి అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ రబాత్ (మొరాకో) దశ పోటీల్లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 83.32మీ. దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచి మొత్తం నాలుగు డైమండ్ లీగ్ పాయింట్లు సాధించాడు.
దీంతో డైమండ్ లీగ్ ఫైనల్ ఈవెంట్‌కు బెర్త్ దక్కించుకున్నాడు. ఈ టోర్నీ ఆగస్టు 30 నుంచి జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) వేదికగా జరగనుంది. అంతకుముందు కూడా దోహా డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానంలో నిలిచి 5 పాయింట్లు, యుజిన్ డైమండ్ లీగ్‌లో ఆరోస్థానంలో నిలిచి 3 పాయింట్లను సాధించాడు.
ఫైనల్లో నీరజ్‌తో పాటు ప్రపంచ ఛాంపియన్ జొహనెస్ వెటర్, ఒలింపిక్ ఛాంపియన్ థామస్ రోహ్లార్, గతేడాది డైమండ్ లీగ్ ఛాంపియన్ జాకుబ్, జర్మనీ ఛాంపియన్ ఆండ్రూస్, మాగ్నస్‌లు పోటీపడనున్నారు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే.
అనంతరం ఫ్రాన్స్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్ ఫైనల్లో జావెలిన్‌ను రికార్డు స్థాయిలో (85.17 మీటర్లు) విసిరి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. 2016లో జరిగిన వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పినా.. మరొకసారి ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాడు.
ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో 86.47 మీటర్లతో ఆ రికార్డు దరిదాపుల్లోకి వచ్చినా, ఆ రికార్డుని అందుకోలేకపోతున్నాడు.