
టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజుకు చేరుకుంది. జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఈ అత్యుత్తమ క్రీడా వేదికలో ప్రపంచ దేశాలకు చెందిన అథ్లెట్లు పతకాల వేటలో పడ్డారు. ఎప్పట్లాగే చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రారంభంలో రెండో స్థానంలో కొనసాగిన ఆతిథ్య దేశం జపాన్.. ఇప్పుడు తన స్థానాన్ని దిగజార్చుకుంది. మూడో స్థానానికి పడిపోయింది. అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా, రష్యన్ ఒలింపిక్స్ కమిటీ నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి. పతకాల సంఖ్య పెరిగే కొద్దీ స్థానాలు మారుతుంటాయి.
ఈ క్రమంలో భారత్ కూడా రెండు పతకాలను ఖాయం చేసుకుంది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను ఇప్పటికే రజత పతకాన్ని అందుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్యాన్ని ముద్దాడారు. మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గోహెయిన్‌కు పతకం ఖాయమైంది. ఇంకా ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉన్నందున.. ఆమె తన పతకం స్థాయిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. స్వర్ణాన్ని సాధించడానికి శ్రమిస్తోన్నారు ఈ అస్సామీ బాక్సర్.
కాగా- అనూహ్యంగా భారత్ మరో ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరింది. పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న థ్రో్యర్ నీరజ్ చోప్రా.. ఫైనల్స్‌లో ప్రవేశించాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డ్ స్థాయి దూరానికి జావెలిన్‌ను సంధించాడు. 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు. గ్రూప్-ఏ విభాగంలో అతనే టాపర్. భారత్‌ను తొలి స్థానంలో నిలిపాడు నీరజ్ చోప్రా. కాగా గ్రూప్-బీ విభాగంలో శివ్‌పాల్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నాడు. జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది.. లేదా తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది.
నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు పైగా జావెలిన్‌ను సంధించడంతో ఆటోమేటిక్‌గా అతను ఫైనల్స్‌కు అర్హత సాధించినట్టయింది. ఈ కేటగిరీలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీ, ఫిన్లాండ్ రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. కాగా ఫైనల్ ఈవెంట్ ఈ నెల 7వ తేదీన ఉంటుంది. ఇదే దూకుడు, ఇదే పెర్‌ఫార్మెన్స్‌ను నీరజ్ కుమార్ ఫైనల్స్‌లో కూడా చూపగలిగితే.. భారత్‌కు మరో పతకం ఖాయమైనట్టే. టాపర్‌గా నిలవగలిగితే.. భారత్ స్వర్ణాన్ని ముద్దాడినట్టే. మహిళల జావెలిన్ థ్రో కేటగిరీలో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన అన్ను రాణి నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఆమె 14 స్థానంతో సరిపెట్టుకున్నారు.