
టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్నఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు భారత్ శుభారంభం చేసింది. పతకాల వైపు మరో అడుగు ముందుకేసింది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లపై భారత్ పెట్టుకున్న సగటు భారత పౌరుడు పెట్టుకున్న ఆశలు నిలిపేలా చేసిందీ విక్టరీ. బాక్సింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, అర్చరీ, హాకీ.. వంటి కీలక ఈవెంట్లలో ముందడుగు వేయడానికి స్ఫూర్తినిచ్చినట్టయింది. మహిళల అర్చరీ 1/8 ఎలిమినేషన్ రౌండ్‌లో భారత అర్చర్ దీపికా కుమారి సంచలన విజయాన్ని నమోదు చేశారు. రష్యా ఒలింపిక్స్ కమిటీకి చెందిన సెనియా పెరోవాను ఓడించారు. క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు.
ఈ ఏడాది గ్వాటెమాలాలో జరిగిన అర్చరీ ప్రపంచకప్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో దీపికా కుమారి స్వర్ణ పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదే దూకుడును ఒలింపిక్స్‌లోనూ కొనసాగించేలా కనిపిస్తోన్నారామె. టోక్యో షూటింగ్ ఎరీనాలో నిర్వహించిన ఈ ఈవెంట్ తొలి సెట్‌లో 9,10,9తో మొత్తం 28 పాయింట్లను సాధించారు. అదే సెట్‌లో సెనియా పెరోవా వెనుకపడ్డారు. 9,9,7తో 25 పాయింట్లను మాత్రమే అందుకున్నారు. రెండో సెట్‌లో దీపికా తడబడ్డారు. 10,9,7తో 26 పాయింట్ల వద్దే నిలిచిపోయారు. పెరావో 9,8,10తో 27 పాయింట్లతో ముందంజ వేశారు.
మూడో సెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరి పోరు సాగింది. దీపికా 10,9,9 స్కోరుతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. 28 పాయింట్లను సాధించారు. పెరోవా 9,9,9తో 27 పాయింట్లతో వెనుకంజ వేశారు. నాలుగో సెట్‌లో ఇద్దరు సమవుజ్జీలుగా నిలిచారు. 9,8,9తో దీపికా, 9,8,9తో పెరోవా 26 పాయింట్లను అందుకున్నారు. అయిదో సెట్‌లో పెరోవా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దీపికా కుమారి 7,10,8 స్కోరుతో 25 పాయింట్ల వద్దే నిలిచిపోగా.. పెరోవా 9,10,9తో 28 పాయింట్లను ఆర్జించారు. నిర్ణయాత్మకమైన షూటాఫ్‌లో దీపికా చెలరేగిపోయారు. 10 పాయింట్లను హిట్ చేశారు. పెరావో మళ్లీ తడబడ్డారు. ఇక్కడ ఆమె అందుకున్న పాయింట్లు ఏడు మాత్రమే.
దీనితో దీపికా కుమారి గెలిచినట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. పెరోవా వరల్డ్ క్లాస్ విమెన్ అర్చర్. 2016లో రియో డి జనేరియోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకాన్ని ముద్దాడారు. ఈ సారి కూడా రష్యా ఒలింపిక్స్ కమిటీ ఆమెపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. దీపికా కుమారి విజృంభణ.. ఆర్‌ఓసీ ఆశలను నీరుగార్చింది. పెరోవా ప్రస్థానం 1/8 ఎలిమినేషన్ రౌండ్‌లోనే ముగిసినట్టయింది. క్వార్టర్‌ఫైనల్స్‌లో దీపికా కుమారి పాల్గొనాల్సి ఉంది. ఈ రౌండ్ ఈ ఉదయం 11:15 నిమిషాలకు ఆరంభమౌతుంది.