
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో తొమ్మిదో రోజు భారత్ అపజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అనూహ్య ఓటమితో తన పతకాల వేటను ప్రారంభించింది. అర్చరీలో మెరుపులు మెరిపించి, పతకంపై ఎన్నో ఆశలు రేకెత్తించిన స్టార్ అర్చర్ అతాను దాస్.. వెనుదిరిగాడు. అత్యంత సంక్లిష్టమైన 1/8 గండాన్ని దాటుకోలేకపోయాడు. 1/16లో కఠినమైన ప్రత్యర్థిపై పైచేయి సాధించిన అతాను.. చివరి రౌండ్‌లో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. వెంట్రుకవాసిలో పరాజయాన్ని చవి చూశాడు.
యుమెనోషియా ఫైనల్ ఫీల్డ్‌లో భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 7:18 నిమిషాలకు అర్చరీ 1/8 ఎలిమినేషన్ రౌండ్ ఆరంభమైంది. 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో చైనీస్ తైపేకు చెందిన డెంగ్ యు-చెయుంగ్, 1/16 రౌండ్‌లో దక్షిణ కొరియా గోల్డ్ మెడలిస్ట్ జిన్ హయెక్‌ను ఓడించిన 1/8లో రౌండ్‌లో అడుగు పెట్టాడతను. ఇక్కడా గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొన్నాడు. ఈ రౌండ్‌లో అతాను దాస్.. జపాన్‌కే చెందిన స్టార్ అర్చర్ టకహరు ఫురుకవతో ఢీ కొట్టాడు. విజయాన్ని పునరావృతం చేయలేకపోయాడు. 6-4 తేడాతో పరాజయం పాలయ్యాడు.
టకహరుపై తొలి సెట్‌లోతో పోటీ పడలేకపోయాడు అతాను దాస్. తొలి సెట్‌లో అతాను 9,8,8, స్కోరుతో 25 పాయింట్లను సాధించాడు. టకహరు 9,9,9 స్కోరుతో 27 పాయింట్లతో పైచేయి సాధించాడు. రెండో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. సెట్ ముగిసే సరికి సమవుజ్జీలుగా నిలిచారు. అతాను దాస్ 10,9,9 స్కోరుతో 28 పాయింట్లను తన ఖాతాలో వేసుకోగా.. టకహరు 9,9,10 స్కోరుతో 28 పాయింట్లను అందుకున్నాడు.
మూడో సెట్‌లోనూ హోరాహోరి పోరు కొనసాగింది. ఈ సెట్‌లో అతాను దాస్..టకహరుపై పైచేయి సాధించాడు. 10,10,8 స్కోరుతో 27 పాయింట్లను ఆర్జించగా- టకహరు 8,10,9 స్కోరుతో 27 పాయింట్ల వద్దే నిలిచాడు. నాలుగో సెట్‌లో మళ్లీ వారిద్దరూ సమవుజ్జీలయ్యారు. 9,10,9తో అతాను దాస్, 9,10,9 స్కోరుతో ఇద్దరూ 28 పాయింట్లను నమోదు చేశారు. అయిదో సెట్‌లో అతాను దాస్ తడబడ్డాడు. అతాను 9,8,9తో 26 పాయింట్లు, టకహరు 9,10,8 స్కోర్‌తో 27 పాయింట్లు అందుకున్నాడు. దీనితో 6-4తో ఎలిమినేషన్ రౌండ్‌లో ఓడిపోయాడు.