
హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి సత్తా చాటింది. అంతర్జాతీయ స్కయింగ్ పోటీల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించింది హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి చెందిన 21 ఏళ్ల ఆంఛల్ ఠాకూర్. టర్కీలోని ఎర్జురుమ్‌లో జరిగిన ఆల్పైన్ ఎజ్దర్ 3200 కప్‌లో పాల్గొన్న 21 ఏళ్ల ఆంఛల్ ఠాకూర్ కాంస్య పతకం సాధించింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్కై రేస్‌గా దీనిని పిలుస్తారు.
తాను కాంస్య పతకం సాధించిన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ఆంఛల్ ఠాకూర్ అభిమానులతో పంచుకుంది. ఇది అనుకోకుండా జరిగిపోయిందని అందులో పేర్కొంది. "చివరకు ఊహించనిది ఒకటి జరిగింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్కై రేస్‌లో ఇది నా అంతర్జాతీయ తొలి మెడల్" అని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
'గత కొన్ని నెలలుగా తీసుకున్న కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆరంభంలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ, చివరకు మూడో స్ధానంలో ముగించాను' అని ఓ జాతీయ పత్రికకను ఇచ్చిన ఇంటర్యూలో ఆంఛల్ పేర్కొంది. తన కుమార్తె సాధించిన విజయంపై అంఛల్ తండ్రి రోషన్ ఠాకూర్ మాట్లాడుతూ ఆమె ఈ పతకం సాధించడం ఎంతో గర్వంగా ఉందని అన్నాడు.
"వాట్సప్‌లో ఆంఛల్ కాల్ చేసి తాను సాధించిన మెడల్‌ను చూపించింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్కై రేస్ ముగిసిన తర్వాత ఓ సావనీర తరహాలో ఆ మెడల్ ఇచ్చారేమో అని అనుకున్నా. కానీ ఆ తర్వాత తాను కాంస్య పతకం గెలిచానని చెప్పడంతో సంతోషించా' అని అన్నాడు. ఆంచల్ స్కయింగ్‌ను మొదట తన తండ్రి నుంచే నేర్చుకుంది. ప్రస్తుతం మాజీ ఒలింపిక్ పతక విజేత హీరా లాల్ వద్ద శిక్షణ పొందుతోంది.
అంతర్జాతీయ స్కయింగ్ పోటీల్లో భారత్‌కు తొలి పతకం అందించిన అంఛల్ ఠాకూర్‌కు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాధోడ్ తన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపాడు. 'టర్కీలో నిర్వహించిన ఎఫ్‌ఐఎస్ ఇంటర్నేషనల్ స్కీయింగ్ పోటీల్లో కాంస్యం గెలిచిన ఆంచల్ ఠాకూర్‌కు అభినందనలు. స్కీయింగ్ విభాగంలో భారత్ పతకాల ఖాతాను తెరిచింది' అని పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.