
హైదరాబాద్: మూడు రోజులుగా భయాందోళనలు మధ్య గడిపిన భారత బాక్సర్లకు కామన్‌వెల్త్ క్రీడా సంఘం కాస్త ఊరటనిచ్చింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆటగాళ్లు ఉండే చోటుకు సిరంజీలు తేవడం నిషిద్ధం. ఈ విషయమై కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న ఇండియన్ టీమ్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది.
క్రీడా గ్రామంలో ఇండియన్ బాక్సింగ్ టీమ్ ఉంటున్న ప్లేస్‌లో సిరంజీలు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. శనివారం భారత బాక్సర్లు ఉండే చోటులో సిరంజీలు దొరకడంతో చర్చ మొదలైంది. దీంతో విచారణ జరిపి భారత ఆటగాళ్లకు దీంతో ఏ సంబంధం లేదని తేల్చి చెప్పేంతవరకు వారి క్రీడా భవిష్యత్ సంగ్దిద్ధంగానే గడిచింది.
గేమ్స్ విలేజ్‌లోకి సాధారణంగా నీడిల్స్‌ను అనుమతించరు. దీంతో ఇది ఉల్లంఘన కిందే ఫెడరేషన్ పరగణించింది. ఈ మేరకు ఇండియన్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి విక్రమ్ సింగ్ సిసోడియాకు ఫెడరేషన్ ఓ వార్నింగ్ లెటర్‌ను పంపించింది. అటు బాక్సింగ్ టీమ్ డాక్టర్‌గా ఉన్న అమోల్ పాటిల్‌ను హెచ్చరిస్తూ మరో లేఖ రాశారు.
వెంటనే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ విధివిధానాలు తెలుసుకోవాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడాలని ఆ లేఖలో హెచ్చరించింది. గత శనివారం గేమ్స్ విలేజ్‌లో సిరంజీలు కనిపించాయని ఫెడరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీవెమ్‌బర్గ్ తెలిపారు. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను మాత్రం ఇండియన్ టీమ్ ఉల్లంఘించిందని గ్రీవెమ్‌బర్గ్ చెప్పారు.