రియో డీ జెనిరో : ఒలింపిక్ క్రీడా సంగ్రామంలో.. భారత మారథాన్ అథ్లెట్ల కోచ్ నికోలయ్ స్నీసర్వ్ ను అక్కడి పోలీసులు అరెస్టు చేయడం వివాదస్పదంగా మారింది. అయితే తక్షణం స్పందించిన అధికారులు ఆయన్ను త్వరగానే విడుదలయ్యేలా చేయడంతో వివాదం సర్దుమణిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రియో 2016లో భాగంగా జరుగుతున్న ఒలింపిక్ మారథాన్ లో పాల్గొనడానికి వెళ్లిన భారత అథ్లెట్లు లలితా బాబర్, సుధా సింగ్, ఓపీ జైషాలకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు నికోలయ్. ఇదే క్రమంలో ఒలింపిక్ మారథాన్ లో పాల్గొన్న జైషా ఎండ వేడి కారణంగా డీ హైడ్రేషన్ కు గురైంది. రేసు ముగిసిన వెంటనే జైషా తీవ్ర డీహైడ్రేషన్ కు లోనవడంతో.. హుటాహుటిన ఒలింపిక్ విలేజ్ లోని ఆసుపత్రికి ఆమెను తరలించారు.

ఆసుపత్రిలో చేర్చిన జైషాను చూసేందుకు కోచ్ లు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడున్న ఓ లేడీ డాక్టర్ ఒక్కరే వెళ్లి చూసిరావాలంటూ చెప్పడంతో.. డిప్యూటీ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ తొలుత ఆమెను చూసేందుకు వెళ్లారు. అనంతరం సదరు లేడీ డాక్టరు వైఖరికి తీవ్ర ఆగ్రహానికి గురైన నికోలయ్.. ఆమెను తోసుకుంటూ జైషాను చూడడానికి లోపలికెళ్లాడు. దీంతో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ సదరు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు నికోలయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు విషయం తెలుసుకున్న ఒలింపిక్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. నికోలయ్ ను విడిపించారు. భారత అథ్లెటిక్ సెక్రటరీ వాల్సన్ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని తెలియజేశారు.