ఇంచియాన్: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు మూడు రోజుల క్రితం ముగిశాయి. ఈ క్రీడల్లో పాల్గొన్న ఏడుగురు అథ్లెట్లు, ఒక రిపోర్టర్ వివరాలు తెలియరావడం లేదని అధికారులు బుధవారం చెప్పారు. ఆసియా క్రీడల్లో సుమారు పదివేల మంది అథ్లెట్లు పాల్గొన్నారు.
క్రీడల కోసం ఇంచియాన్ వచ్చిన అథ్లెట్లు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, అందులో ఏడుగురు అథ్లెట్ల లెక్క తేలడం లేదు. నేపాల్‌కు చెందిన ముగ్గురు, శ్రీలంకకు చెందిన ఇద్దరు, బంగ్లాదేశ్, పాలస్తీనాకు చెందిన ఒక్కో అథ్లెట్.. మొత్తం ఏడుగురి వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

అలాగే పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ రిపోర్టర్ ఆచూకీ కూడా లేదని చెప్పారు. వీరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే, ఈ ఎనిమిది మంది అక్రమంగా పని చేసుకోవడానికి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నరు. ఈ ప్రాంతంలో అక్రమంగా ఎంతోమంది వలసదారులు నివసిస్తుంటారని చెప్పారు. అథ్లెట్లకు అక్టోబర్ 19 వరకు, రిపోర్టర్‌కు అక్టోబర్ 30 వరకు వీసా గడువు ఉంది.