తరాలు మారుతున్నా భారత్ లో క్రికెట్ ఆదరణ మరింత పెరుగుతుందంటే.. దానికి కారణం ఎంతో మంది ప్లేయర్ల అత్యుత్తమ ప్రదర్శన. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్,సచిన్ టెండూల్కర్,ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి,రోహిత్ శర్మ.. ఇలా ఎందరో ప్లేయర్లు ప్రత్యర్థిపై పైచేయి సాధించి భారత్ ను విజేతగా నిలిపారు. అయితే చెస్ అంటే గతంలో అయినా, వర్తమానంలో అయినా అందరికీ ఠక్కున గుర్తు వచ్చేది ఒక్కరి పేరే. ఆయనే విశ్వనాథన్ ఆనంద్. ఇవాళ ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ గురించి ఆసక్తికర విషయాలు..
చెస్ లో గ్రాండ్ మాస్టర్ హొదాను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. అలాంటి గొప్ప ఘనతను సాధించిన తొలి భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్. 1969లో జన్మించిన ఆయన 1988లోనే గ్రాండ్ మాస్టర్ గా చరిత్రకెక్కాడు.ప్రపంచ చదరంగానికి భారత్ సత్తాను పరిచయం చేసిన ఘనుడు ఆయనే.

ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. విశ్వనాథన్ ఆనంద్ ఏకంగా అయిదు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. 2000 ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో తొలిసారిగా ఛాంపియన్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా వ్యక్తిగానూ రికార్డులకెక్కాడు.
2006 ఏప్రిల్ లో మరో ఘనత సాధించాడు విశ్వనాథన్ ఆనంద్. ఫిడే రేటింగ్ పాయింట్స్ లో 2800 మార్క్ ను దాటిని నాలుగో ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఆయన కంటే ముందు గ్యారీ, వ్లాదిమిర్, టొపాలవ్ సాధించారు.
క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా భావించే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. 1991-92లో ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించగా తొలుత అందుకున్నది ఆయనే. అంతేగాక విశ్వనాథన్ ఆనంద్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.