హైదరాబాద్: భారత్‌లో పారా అథ్లెట్ల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అని చెప్పడానికి మరొక ఉదాహరణ. భారత్‌కు చెందిన ఓ పారా అథ్లెట్‌కు జర్మనీలో చేదు అనుభవం ఎదురైంది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఇవ్వకపోవడంతో బెర్లిన్‌లో ఆ అథ్లెట్ భిక్షాటన చేస్తోంది.

నాగ్‌పూర్‌కు చెందిన కాంచనమాల పాండే అంధురాలు. ఆమె ఎస్11 కేటగిరీలో స్విమ్మింగ్ కాంపిటిషన్‌లో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లింది. కానీ ఈ పర్యటన కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని కమిటీ ఆమెకు ఇవ్వలేదు. కాంచనమాలతోపాటు మరో ఐదుగురు ఈ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నారు.
జులై 3 నుంచి 9 వరకు ఈ పోటీలు జరిగాయి. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుక వెళ్లిన వీరికి డబ్బులు చెల్లించలేదు. ఈ విషయం తెలిసిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశాడు.
బింద్రా ట్వీట్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ వెంటనే స్పందించారు. తమ శాఖ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారని, విషయం తెలిసిన తర్వాత స్పందిస్తానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా అలసత్వం వల్లే ఇలా జరిగిందని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఇదిలా ఉంటే భారత్ నుంచి వరల్డ్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌కు కాంచనమాలతో పాటు సుయాష్ జాదవ్ క్వాలిఫై అయ్యారు. ఈ ఇద్దరూ బెర్లిన్‌లో జరిగిన పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ పతకాలను సాధించారు. ప్రభుత్వం నుంచి డబ్బు అందకపోవడంతో జర్మనీలో భిక్షాటన చేయాల్సి వచ్చిందని కాంచనమాల ఆవేదన చెందింది.
తనకీ దుస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఆమె వాపోయింది. ఈ టోర్నీలో పాల్గొనడానికి ఐదు లక్షల లోన్ తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. పారాలింపిక్ కమిటీ తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ఇప్పుడు హోటల్‌కు రూ.70 వేలు, భోజనానికి రూ.40 వేలకుపైగా చెల్లించాల్సి ఉందని చెప్పింది.