లక్నో: భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారి ఒకరు రూ.1000 చెక్కు పంపించారు. దాంతో పాటు థ్యాంక్యూ అంటూ ఓ లేఖ కూడా రాశారు. ధోనీకి చెక్కు పంపించిన అధికారి అమితాబ్ ఠాకూర్. అతని ఐజీగా పని చేస్తున్నారు.
ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చింది. భారత్ ఓడిపోవడంపై ప్రతి అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు జట్టు పైన మండిపడ్డారు.

అయితే, 1992 బ్యాచ్‌కు చెందిన సదరు ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ మాత్రం.. ఓటమిలో సానుకూలతను చూశారు. అతను ధోనీకి రూ.1000 చెక్కు, ఓ లేఖను రాంచీలోని ధోనీ ఇంటి అడ్రస్‌కు పంపించారు.
సెమీ ఫైనల్లో ఓడటం ద్వారా భారత్ అభిమానులను మరో రోజు (ఫైనల్ డే) టీవీలకు అతుక్కు పోకుండా కాపాడారని అభిప్రాయపడ్డారు. క్రికెట్ ప్రభావం యువతతో పాటు అందరి పైన బాగా ఉందని, ముఖ్యంగా ప్రపంచ కప్ ప్రభావం బాగా పడుతోందని ఆయన పేర్కొన్నారు.
సెమీ ఫైనల్ రోజున దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది.. సీనియర్లు, జూనియర్లు సహా టీవీలకు అతుక్కుపోయారని, ఆఫీస్ వర్క్‌ను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు. క్రికెట్‌కు అతుక్కు పోవడం వల్ల చాలామంది తమ డ్యూటీని మరిచిపోతున్నారని అభిప్రాయపడ్డారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు పనిని పక్కన పెడుతున్నారన్నారు.
సమాజం తన పని తాను చేయాలని, అందుకోసం క్రికెట్ అభిమానులకు మీరు పిలుపునివ్వాలని ధోనీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను కాబట్టి క్రికెట్‌ను ద్వేషిస్తానని పేర్కొన్నారు. క్రికెట్ వల్ల చాలామంది ఏమాత్రం పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ ఉంటే ఆఫీసులకు సెలవు పెట్టొద్దని, పని మానొద్దని సూచించారని ఆయన ధోనీని కోరారు.