ఫైనల్లో చిన్నబోయిన చిరుత: బోల్ట్‌కు ఊహించని షాక్
హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలంగా 100 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ తన కెరీర్ చివరి రేసులో మాత్రం చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా తన అభిమానులందరినీ నిరాశపరిచాడు.
లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌లో నెమ్మదిగా పరుగెత్తి రెండో స్థానంలో నిలిస్తే, ఫైనల్ రేసు కోసం వ్యూహాత్మకంగా బోల్ట్ తన శక్తినంతా దాచుకున్నాడని అందరూ భావించారు. తన కెరీర్‌లో చివరి 100 మీటర్ల రేసులో తొలిసారి కాంస్యానికే పరిమితమయ్యాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 15 నిమిషాలకు లండన్ ఒలింపిక్ స్టేడియంలో 60 వేల మంది ప్రేక్షకుల నడుమ పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసు జరిగింది. ఈ రేసులో ఎనిమిది మంది ప్రపంచ అథ్లెట్లు బరిలోకి దిగారు.
పైనల్లో డోపీగా తేలి, నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొని ఆ తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి అడుగుపెట్టి బోల్ట్‌కు గట్టి పోటీ ఇచ్చి అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ 9.92 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణం సాధించాడు. ఇక క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా) 9.94 సెకన్లతో రెండో స్థానంలో నిలవగా, ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు.

తొలిసారి కాంస్య పతకం
దీంతో కాంస్య తొలిసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బోల్ట్ పోటీపడ్డ మేజర్ ఫైనల్స్‌లో (ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్) ఇప్పుడు నమోదు చేసిందే అత్యల్ప టైమింగ్ కావడం గమనార్హం. ఆరేళ్ల కిందట డేగులో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ (2011) 100 మీటర్ల పరుగులో ఏం జరిగిందో అందరికీ గుర్తే. తుపాకీ మోత పూర్తి కాకముందే రేసును మొదలుపెట్టేసి అనర్హత వేటుకు గురయ్యాడు బోల్ట్. అప్పటి నుంచి రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తి, ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచి... చివర్లో తన ప్రత్యర్థులను వెనక్కి నెడుతూ లక్ష్యం వైపు దూసుకుపోవడం బోల్ట్ శైలి. కానీ ఈ రేసులో మాత్రం అలా జరగలేదు.

రేసు మొదలైన సెకన్ నుంచే
రేసు మొదలైన సెకన్ నుంచే బోల్ట్ వెనుకబడ్డాడు. రేసు ప్రారంభించడానికి ఎనిమిది మంది అథ్లెట్స్ తీసుకున్న స్పందన సమయంలో బోల్ట్ ఏడో స్థానంలో ఉన్నాడు. అందరికంటే వేగంగా స్పందించిన కోల్మన్, గాట్లిన్, యోహాన్ బ్లేక్, అకాని సింబని, ప్రెస్కోడ్, జిమ్మీ వికాట్ ముందుకు దూసుకుపోతుండగా వీరిని అందుకోవడానికి బోల్ట్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత ప్రత్యర్థులందరినీ వెనక్కి నెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా బోల్ట్ పక్కనే ఉన్న కోల్మన్ అతడికి గట్టి సవాలు విసిరాడు.

విజేత ఎవరన్న దానిపై స్పష్టత
బోల్ట్ అతడిని అందుకోవడానికి విపరీతంగా శ్రమించాడు. చివర్లో బోల్ట్ తన పక్కనున్న కోల్మన్ను దాటినట్లే ఉంది. కానీ అతనే విజేత ఎవరన్న దానిపై స్పష్టత లేదు. బోల్ట్ అడుగులైతే కోల్మన్ కన్నా ముందున్నట్లు కనిపించింది. కానీ శరీరంలో ముందు భాగం మాత్రం అలా లేదు. దీంతో ఆ ఇద్దరిలో ఎవరు విజేత అన్నదానిపై సందిగ్ధత.. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. బోల్ట్.. కోల్మన్ను అధిగమించాడా లేదా అంటూ అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.

బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గాట్లిన్
కానీ అందరి దృష్టీ బోల్ట్, కోల్మన్ మీద ఉండగా... ఏడో వరుసలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన గాట్లిన్ సంగతి అందరూ మరిచిపోయారు. 90 మీటర్ల వద్ద కోల్మన్ను బోల్ట్ అందుకున్నట్లే అనిపించినా... మరోవైపు ఎవ్వరూ అంతగా పట్టించుకోని జస్టిన్ గాట్లిన్ తన అనుభవాన్నంతా రంగరించి బుల్లెట్ వేగంతో దూసుకుపోయి అందరికంటే వేగంగా గమ్యానికి చేరుకున్నాడు. 0.2 సెకన్ల తేడాతో కోల్మన్కు రెండో స్థానం, 0.1 సెకన్ల తేడాతో బోల్ట్‌కు మూడో స్థానం లభించాయి. ఫలితం ప్రకటించాక రీప్లే చూశాక కానీ.. రేసులో అసలేం జరిగిందో అభిమానులకు అర్ధం కాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications