తిరువనంతపురం: కేరళలో ఆత్మహత్య చేసుకున్న మహిళా అథ్లెట్.. దానికి ముందు తన తల్లిని క్షమాపణలు కోరారు. 'అమ్మా నన్ను క్షమించు' అని సదరు అథ్లెట్ తల్లిని కోరింది. భారత క్రీడా అథారిటీ వాటర్ స్పోర్ట్స్ సెంటరులో శిక్షణ పొందుతున్న నలుగురు మహిళా అథ్లెట్లు పాయిజన్ అయిన పండ్లు తిన్నారు. అందులో అపర్ణ అనే మహిళా అథ్లెట్ మృతి చెందింది.
దీనిపై సదరు అథ్లెట్ తల్లి మాట్లాడుతూ.. మెంటల్, ఫిజికల్ టార్చర్ ఉన్నట్లు తనకు అపర్ణ చెప్పిందని తెలిపారు. హాస్టల్లోని సీనియర్ అథ్లెట్లు వేధిస్తున్నట్లు చెప్పారన్నారు. 'అమ్మా.. నన్ను క్షమించు, సీనియర్ల వేధింపుల వల్ల నేను ఇలాంటి పని చేశానని, నేను బతకలేనని' చనిపోయే ముందు చెప్పిందని అన్నారు.
తన కూతురుకు ఆత్మహత్య చేసుకునే రకం కాదని, సీనియర్ల వేధింపుల వల్లనే ఆమె ఒత్తిడిలో అలా చేశారని ఆరోపించారు. తన కూతురు ఇంటికి వచ్చినప్పుడు తనతో మాట్లాడిందని, సీనియర్లతో గదిని పంచుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పిందని తెలిపారు. ఇదే విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు చెబితే, మూడు నెలల్లో మారుస్తామని చెప్పారని తెలిపారు.

కాగా, భారత క్రీడా అథారిటీ వాటర్ స్పోర్ట్స్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న నలుగురు మహిళా అథ్లెట్లలో గురువారంనాడు ఒకరు మరణించగా, మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. సీనియర్ల వేధింపులను తట్టుకోలేక వారు విషపూరితమైన పండ్లను తిని వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికంగా పండే ఒథలాంగా అనే పండ్లను వారు తిన్నట్లు అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు ఎసల్ఎఐ వసతి గృహంలో వాటిని తిన్నారు.
వాటిని తిన్న తర్వాత వారు స్పృహ తప్పి పడిపోయారు. దాంతో వారిని సాయంత్రం 7 గంటలకు ఆస్పత్రికి తరలించారు. అలపుఝా వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 ఏళ్ల అథ్లెట్ మరణించింది. వారిని సీనియర్లు కొంత మంది శారీరకంగా, మానసికంగా హింసించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను హాస్టల్ వార్డెన్ ఖండించారు.