రియో డీ జనీరో: 'రెప్‌చేజ్' అనేది ఫ్రెంచ్ పదం. దీని అర్ధం ఏమిటంటే సెకండ్ ఛాన్స్ అని. ఇప్పుడు ఈ పదం రియో ఒలింపిక్స్‌లో మరోసారి తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... రియో ఒలింపిక్స్‌లో భాగంగా మహిళల రెజ్లింగ్ 58 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ రెపిచేజ్ రౌండ్లలో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్, లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్ 'రెప్‌చేజ్' ద్వారా కాంస్య పతకాలు సాధించగా, ముచ్చటగా మూడోసారి రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 'రెప్‌చేజ్' అనే పదం సాక్షికి తెలియకపోయినా రియో ఒలింపిక్స్‌లో తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

'రెప్‌చేజ్' అంటే
రెజ్లింగ్ పోరులో 'డ్రా' అయితే రెండు పార్శ్వాల నుంచి ఇద్దరు ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఫైనల్‌కు చేరిన వారిద్దరి చేతుల్లో ఎవరైతే ఓడిపోయారో వారందరికీ 'రెప్‌చేజ్' ద్వారా మరో అవకాశం కల్పిస్తారు. గతంలో సుశీల్‌కుమార్, యోగేశ్వర్ దత్ విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు సాక్షి మాలిక్ విషయంలో సరిగ్గా అలాగే జరిగింది.
Also Read: రియో పతకం: 5రికార్డులు సృష్టించిన సాక్షి మాలిక్
వివరాల్లోకి వెళితే... మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో ప్రిక్వార్టర్స్ వరకూ అసాధారణంగా పోరాడిన సాక్షి మాలిక్ ఆ తర్వాత క్వార్టర్స్ ఫైనల్స్‌లో ఓటమి పాలైంది. అయితే క్వార్టర్‌ఫైనల్ ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో రెపిచేజ్‌కు అర్హత పొందిన సాక్షి మాలిక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి కాంస్య పతకం సాధించింది.

క్వార్టర్ ఫైనల్‌లో రష్యన్ రెజ్లర్ వాలెరీ కొబ్లోవా చేతిలో పరాజయం పాలైన సాక్షి మాలిక్ పతకం మీద ఆశలు మాత్రం వదులుకోలేదు. సాక్షి మీద గెలిచిన వాలెరీ ఫైనల్‌కు వెళ్లడంతో ఆమెకు 'రెప్‌చేజ్' అవకాశం దక్కింది. దీంతో కాంస్య పతకం కోసం మంగోలియా రెజ్లర్ ఒర్ఖాన్ పురెవ్‌డోర్జ్‌ను 12-3 తేడాతో చిత్తుగా ఓడించింది.
Also Read: రియోలో భారత్‌కు కాంస్యం: ఎవరీ సాక్షి మాలిక్?
ఆ తర్వాత పోరు ప్రథమార్ధం ముగిసేసరికి 2-2తో సమానంగా నిలిచిన సాక్షి.. ద్వితీయార్ధంలో చెలరేగిపోయింది. చివరకు 8-5తేడాతో విజయం సాధించి 12 రోజుల భారతీయుల నిరీక్షణకు తెరదించింది.