రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ ఓపీ జైషాకు మన అధికారులు మంచినీళ్లు అందించకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన వివరాలిలా ఉన్నాయి.
రియో ఒలింపిక్స్‌లో భారత్ తరుపున 42 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్న అనంతరం జైషా మూడు గంటల పాటు స్పృహలో లేదు. ఆ సమయంలో ఆమె గురించి పట్టించుకునేందుకు భారత మహిళల మారథాన్ కోచ్, మన అధికారులెవ్వరూ లేకపోవడం గమనార్హం.

వాస్తవానికి 42 కిలోమీటర్ల ర్యాలీలో ప్రతి 8 కిలోమీటర్లకు ఒకచోట నిర్వాహకులు ఏర్పాటుచేసిన వాటర్ బాటిల్స్ లభిస్తాయి. ఇవి కాకుండా అథ్లెట్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న దేశాలు సొంతగా ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒక చోట రన్నర్లకు మంచినీళ్లు అందించే వీలుంటుంది.
కానీ తనకు మంచి నీరు ఇచ్చే నాథుడే లేడని, తాను బతికి ఎలా బయటపడ్డానో తనకే ఆశ్చర్యంగా ఉందని జైషా వాపోయింది. మారథాన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైందని, ఆ సమయంలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉందని, మంచినీరు లేక విలవిలలాడిపోయానని చెప్పింది.
గొంతు తడారిపోతున్నా పరుగు ఆపలేదని, ఎక్కడన్నా భారత్ త్రివర్ణ పతాకం కనబడకపోదా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశానని, మన జెండా పట్టుకుని నాకు నీళ్లిచ్చేవాళ్లు ఎక్కడా కనబడలేదని వాపోయింది. దీంతో 8 కిలోమీటర్లకు ఒకసారి ఒలింపిక్ నిర్వహకులు ఏర్పాటుచేసిన నీళ్ల మాత్రమే తాగాల్సివచ్చిందని విలపించింది.
157 మంది రన్నర్లు పాల్గొన్న మారథాన్‌లో 89 స్థానంలో రేసు పూర్తిచేసిన జైషా కుప్పకూలి పడిపోగానే వెంటనే ఆమెను ఒలింపిక్స్‌లో గ్రామంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్లినిక్‌కు తరలించారు. సుమారు మూడు గంటల తర్వాత గానీ ఆసుపత్రికి చేరుకున్న భారత అధికారులు జైషాను స్వస్థలం (కేరళ)కు పంపించే ఏర్పాటుచేశారు.
అయితే బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న జైశా మరీ నీరంగా కనిపించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగుళూరుకు చేరుకున్న జైషా మీడియాతో మాట్లాడుతూ ఇది నాకు రెండో జన్మలాంటిందని, నీళ్లు తాగకుండా మారథాన్ పరుగెత్తడం చావును కొనితెచ్చుకున్నట్లే వ్యాఖ్యానించింది.
కాగా, జైషాతో పాటు లాంగ్ డిస్టెన్స్ పోటీల్లో పాల్గొన్న మరో అథ్లెట్ సుధా సింగ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు జికా వైరస్ సోకి ఉండొచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు డాక్టర్లు ఆమె నమూనాలను పరీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై కేంద్ర క్రీడల శాఖా మంత్రి విజయ్ గోయెల్ ను ప్రశ్నించగా, ఇటువంటి చిన్నచిన్న సంఘటనలు జరుగుతుండటం మామూలేనని అన్నారు.