
హైదరాబాద్: భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ మరోసారి సత్తా చాటింది. పోలాండ్ వేదికగా జరుగుతున్న పొజన్ అథ్లెటిక్స్ ప్రీలో 200 మీటర్ల రేసులో స్వర్ణ పతకం సాధించింది. గత కొన్ని నెలలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న హిమ దాస్.. ఆ నొప్పిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా స్వర్ణ పతకం సాధించడం విశేషం.
ఈ ఏడాది హిమదాస్ పాల్గొన్న తొలి 200 మీటర్ల రేసు ఇది. ఈ రేసును 23.10 సెకన్లలో పూర్తి చేసిన హిమ దాస్, ఈ ఏడాది వ్యక్తిగతంగా అత్యుత్తమ రికార్డును నెలకొల్పింది. మరో భారత స్ప్రింటర్ వీకే విస్మయా 23.75 సెకన్లలో ఈ రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.
పురుషుల 200 మీటర్ల ఈవెంట్‌ని ముహ్మద్ అనాస్ 20.75 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. ఇక, 400 మీటర్ల రేసులో కేఎస్ జీవన్ కాంస్య పతకం సాధించాడు. ఇక, షాట్‌పూట్ ఆటగాడు తేజేందర్‌పాల్ సింగ్ తూర్ ఈవెంట్‌ని 19.62 మీటర్లతో పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించాడు.