
హైదరాబాద్: అమెరికాలో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రియాంట్(41) దుర్మరణంపై క్రీడాలోకం షాక్‌కు గురైంది. ఆదివారం సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్‌బీఎ లెజెండ్ కోబ్ బ్రయాంట్ మరణించిన సంగతి తెలిసిందే.
కొబ్ బ్రయాంట్ మృతి వార్త తెలియడంతో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది. ఈ ప్రమాదంలో కొబ్ బ్రయాంట్‌తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానాతో పాటు మొత్తం తొమ్మిది మంది మరణించారు. కొబ్ బ్రయంట్, ఆయన కూతురు జియానాను అధికారులు గుర్తించగా.. పైలట్, మరో ఆరుగురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
కొబ్ బ్రయాంట్ దుర్మరణంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది క్రీడాకారులతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సంతాపాన్ని తెలిపారు. తాజాగా, లాస్ ఏంజెల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్‌లో జరుగుతున్న గ్రామీ అార్డుల్లో మ్యూజిషియన్స్ కొబ్ బ్రయాంట్‌కు నివాళులు అర్పించారు. ఇదే స్టేపుల్స్ సెంటర్‌లో తాను ప్రాతినిథ్యం వహించిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.
గ్రామీ అవార్డుల కార్యక్రమం ప్రారంభానికి ముందు పాప్ స్టార్ లిజ్జో "Cuz I Love You", "Truth Hurts"లను ప్రదర్శించడానికి ముందు "ఈరాత్రి కోబ్ కోసం" అని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "మనమందరం ప్రస్తుతం బాధను అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు లాస్ ఏంజిల్స్, అమెరికా ఒక హీరోని కోల్పోయింది. కోబ్ బ్రయాంట్ నిర్మించిన ఇంట్లోనే మనందరం హృదయపూర్వకంగా నిలబడి ఉన్నాం" అని చెప్పుకొచ్చింది.
కాగా, ఈ కార్యక్రమంలో ఆరు గ్రామీ అవార్డులకు ఎంపికైన లాస్ ఏంజిల్స్ టీన్ పాప్ స్టార్ బిల్లీ ఎలిష్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో బ్రయాంట్‌తో అతడి కుమార్తె జియానా మాట్లాడుతున్న ఫోటోను పోస్టు చేసి "Uggghhhhhhhhh" అని కామెంట్ పెట్టాడు.
మరోవైపు గ్రామీ నామినీ కామిలా కాబెల్లో కూడా బ్రయాంట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి... తాను బాస్కెట్‌బాల్ అభిమాని కాకపోయినప్పటికీ అతడి జీవితం ఆధారంగా తీసిన "మ్యూస్" అనే డాక్యుమెంటరీని పోస్టు చేసి బాధాకరమైన సమయం వచ్చిందని రాసుకొచ్చింది.
"నేను అతడి ప్రతి ఇంటర్వ్యూను చూశాను, కోచ్ చెప్పిన ప్రతి కోట్ చదివాను. అతను నన్ను ఎన్నిసార్లు రక్షించాడో, నేను సొంతంగా ఓ ఛాంపియన్‌ను యాక్సెస్ చేయడానికి ఎన్నిసార్లు అతను నాకు సహాయం చేశాడో నాకు తెలుసు" అని ఆమె తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది.
కొబ్ బ్రయాంట్ తన 20 ఏళ్ల కెరియర్‌లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. 2016లో ఎన్‌బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు.