సిడ్నీ: భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ హర్బజన్ సింగ్ పై వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ మాథ్యూ హెడెన్ విచారం వ్యక్తం చేశాడు. హర్బజన్ ను కలుపు మొక్క అంటూ హెడెన్ నిందించిన విషయం విదితేమే. హర్బజన్ తో రాజీకి సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు. హర్భజన్ పై వ్యాఖ్య చేసి తాను తప్పు చేశానని అతను ఒప్పుకున్నాడు. భారత పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు అగ్గిలో ఆజ్యం పోసినట్లైందని హెడెన్ అన్నాడు.
హర్భజన్ ఎలా ఫీలవుతున్నాడో తనకు తెలియదని, తాను వేరే పదజాలం వాడాల్సి ఉండిందని అతను అన్నాడు. తన 15 ఏళ్ల క్రికెట్ చరిత్రలో మొదటి సారి నోరు జారానని, హర్బజన్ ను అవమానపరిచే ఉద్దేశం తనకు లేదని అతను అన్నాడు. తనను హర్భజన్ అబద్ధాలకోరు అనడంపై తాను హర్భజన్ తో మాట్లాడుతానని, సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తానని అతను చెప్పాడు. తాను భారత్ కు రాగానే హర్భజన్ తో మాట్లాడ్తానని, బజ్జీతో రాజీ కుదుర్చుకోవాలని తాను మనసారా కోరుకుంటున్నానని ఆయన చెప్పాడు. ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య సంబంధాలు చెడిపోవని హెడెన్ అభిప్రాయపడ్డాడు.