
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత రెజ్లర్ భజరంగ్ పూనియాకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించినందుకు గానూ రూ.3 కోట్లు క్యాష్ అవార్డు అందించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు పునియాకు హర్యానా క్రీడల మంత్రి అనిల్ విజ్ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. ఆసియా గేమ్స్‌లో భాగంగా రెజ్లింగ్ 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పూనియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పోటీ అనంతరం పూనియా మాట్లాడుతూ "ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో కొంతమందే స్వర్ణాలు గెలిచారు. అందుకే ఇది నాకో పెద్ద ఘనత" అని అన్నాడు.
"ఒకే ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడలు పసిడి పతకాలు గెలిచిన యోగేశ్వర్ దత్, రాజిందర్‌సింగ్ సరసన చేరడం గర్వంగా అనిపిస్తోంది. ప్రజల ఆశీస్సుల వల్లే తాను పతకం సాధించానని పునియా పతకం గెలిచాను" అని తెలిపాడు.
పోటీ మొదలైన నిమిషంలోనే ప్రత్యర్థిని పట్టేసి భజరంగ్ 6-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే సమయంలో డైచి ఎదురుదాడికి దిగాడు. భజరంగ్‌ను తెలివిగా మ్యాట్ మీద పడేసి 4 పాయింట్లు గెలిచాడు. తొలి రౌండ్ ఆఖరికి భజరంగ్ 6-4తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత డైచి మరోసారి ప్రత్యర్థిని పట్టడంతో స్కోరు 6-6తో సమమైంది.
పోటీ ముగియడానికి సరిగ్గా 100 సెకన్లు ఉందనగా భజరంగ్ తన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతమైన రీతిలో పుంజుకున్నాడు. ప్రత్యర్థిని దొరకబుచ్చుకున్న పూనియా 8-6తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు మరోసారి డైచిని పట్టేసి 10-8తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత రక్షణాత్మకంగా ఆడిన భజరంగ్ సాంకేతికంగా మరో పాయింట్ గెలిచి 11-8తో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
దీంతో యోగేశ్వర్‌దత్ (2014), కర్తార్‌సింగ్ (1978, 86), సత్పాల్‌సింగ్ (1982), రాజిందర్‌సింగ్ (1978), చంగ్డిసింగ్ (1970) తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడిగా భజరంగ్ నిలిచాడు. అంతేకాకదు ఒకే ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన భారత మూడో రెజ్లర్ భజరంగ్.