హామిల్టన్ టైటిల్ కొట్టేయడం ఐదోసారి!!

మెక్సికో సిటీ: మిగతా డ్రైవర్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్-7లో నిలిస్తే ప్రపంచ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్నది సాధించాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో డ్రైవ్ చేసిన ఈ బ్రిటన్ డ్రైవర్ నాలుగో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
మరో రెండు రేసులు మిగిలుండగానే:
33 ఏళ్ల హామిల్టన్ ఐదో టైటిల్‌తో జువాన్ మాన్యుయెల్ ఫాంగియో సరసన నిలిచాడు. ఏడుసార్లు విజేతగా నిలిచిన మైకెల్ షుమాకర్ మాత్రమే అతడికన్నా ముందున్నాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రిలో 71 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 39 నిమిషాల 47.589 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానాన్ని పొందాడు. ఈ రేసులో 12 పాయింట్లు సంపాదించిన హామిల్టన్ మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 358 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.
2008, 14, 15, 17లలోనూ ప్రపంచ టైటిల్‌ను
గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017లలో ప్రపంచ టైటిల్‌ను గెలిచాడు. తాజా విజయంతో హామిల్టన్ ఎఫ్1 టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న డ్రైవర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫాంగియో (అర్జెంటీనా) సరసన చేరాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ-7 సార్లు) ‘టాప్'లో ఉన్నాడు. మెక్సికో రేసులో రెండో స్థానాన్ని పొందిన నాలుగుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) 294 పాయింట్లతో ఈ సీజన్‌లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
ఫార్ములావన్ టైటిల్ గెలవాలన్నది నా కల
‘ఫార్ములావన్ టైటిల్ గెలవాలన్నది నా కల. కానీ ఐదు టైటిళ్లు సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ స్థాయికి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని హామిల్టన్ అన్నాడు. షుమాకర్ రికార్డును అందుకోవడం గురించి తాను ఆలోచించట్లేదని, ఇప్పటికీ అతడే గొప్ప ఫార్ములావన్ డ్రైవర్ అని చెప్పాడు. రేసు విజయాల్లో షుమీ చాలా ముందున్నాడని అన్నాడు. షుమాకర్ 91 ఫార్ములావన్ రేసుల్లో నెగ్గగా.. హామిల్టన్ ఇప్పటివరకు 71 రేసుల్లో విజేతగా నిలిచాడు.
రెడ్‌బుల్ డ్రైవర్ మార్క్ వెర్‌స్టాపెన్
రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెర్‌స్టాపెన్ గంటా 38 నిమిషాల 28.851 సెకన్లలో గమ్యానికి చేరి మెక్సికో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను గెల్చుకున్నాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 11వ స్థానంలో నిలువగా... పెరెజ్ 38వ ల్యాప్‌లో నిష్క్రమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications