ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్‌లో తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయిన భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్... నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫయర్స్ లోని ఆఖరి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓటమి చెందినప్పటికీ.. అతడు క్వార్టర్స్ కు అర్హత సాధించాడు.
ఒక్క మ్యాచ్ కూడా నో..
ఈ టోర్నీలోని రౌండ్ రాబిన్ స్టేజ్ లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన గుకేశ్.. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేకపోయాడు. ఏడు మ్యాచ్ లను 'డ్రా' చేసుకున్న అతడు... మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందాడు. ఆరు, ఏడో రౌండ్లలో కరువానా, కీమర్‌లతో తలపడిన గుకేశ్.. ఆ రౌండలలో డ్రా చేసుకున్నాడు. ఎనిమిదో రౌండ్ లో మాత్రం ఫెదోసీవ్‌తో పాయింట్ పంచుకున్నాడు. ఇక చివరి తొమ్మిదో రౌండ్లో మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు వచ్చి చేరడంతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఫలితంగా నాకౌట్ ఆడేందుకు అర్హత సాధించాడు.

గుకేశ్ తో పాటు నాకౌట్ కు చేరింది వీరే
మొత్తంగా పది మంది పాల్గొన్న ఈ టోర్నీలో అలీరెజా, సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాలను పంచుకున్నారు. అమెరికా గ్రాండ్ మాస్టర్ కరువానా (6 పాయింట్లు), మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), నకముర (అమెరికా) చెరో ఐదు పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. కీమర్ (4), నొదిర్‌బెక్ (3.5) ఆరు ఏడు స్థానాన్ని దక్కించుకున్నారు. వీళ్లంతా నాకౌట్ కు చేరుకున్నారు. ఫెదోసివ్ (2.5), ఆరోనియన్ (1.5) మాత్రం టోర్నీ నుంచి వైదొలిగారు.