
హైదరాబాద్: దోహా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐఏఏఎఫ్ డైమండ్ లీగ్ టోర్నీలో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శన చేశాడు. త్రుటిలో పతకం కోల్పోయిన నీరజ్ చోప్రా ఓ జాతీయ రికార్డుని మాత్రం బద్దలు కొట్టాడు. డైమండ్ లీగ్‌లో శుక్రవారం జరిగిన పోటీల్లో నీరజ్ జావెలిన్‌ను 87.43 మీటర్ల దూరం విసిరి నాలుగో స్ధానంలో నిలిచాడు.
అంతేకాదు గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (86.48 మీ)ను బద్దలు కొట్టాడు. రెండేళ్ల క్రితం అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సందర్భంగా అతను ఈ రికార్డు సృష్టించాడు. అయితే రికార్డు ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రాకు పతకం మాత్రం దక్కలేదు.
ప్రపంచ ఛాంపియన్ జొనాస్ (91.56 మీటర్లు) స్వర్ణం నెగ్గగా.. ఒలింపిక్ ఛాంపియన్ థామస్ రొలర్ (91.78 మీటర్లు) రజతం, ఆండ్రెస్ హోఫ్‌మన్ (90.08 మీటర్లు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు జర్మనీ అథ్లెట్లే కావడం విశేషం. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.