హైదరాబాద్: భారత చెస్ గ్రాండ్ మాస్టర్, కామన్వెల్త్ ఛాంపియన్ అభిజిత్ గుప్తా రికార్డు సృష్టించాడు. హూగెవీన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీని వరుసగా రెండోసారి దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. నెదర్లాండ్స్‌లోని డచ్ హామ్లెట్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 9 రౌండ్లకు గాను 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిదీంతో ఫిడే ఓపెన్ టోర్నీలో వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన ఈ 27 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ స్థానిక ఆటగాడు లుకాస్ వాన్ ఫారెస్ట్‌తో జరిగిన ఫైనల్ రౌండ్‌ను డ్రాగా ముగించాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో అభిజిత్ ఆరు గేముల్లో గెలిచి, మిగతా మూడింటిని 'డ్రా' చేసుకున్నాడు.
కాగా, ఈ టోర్నీలో రెండు, మూడు, నాలుగు స్థానాలు కూడా భారత ఆటగాళ్లకే దక్కడం విశేషం. భారత్‌కే చెందిన సందీపన్ చందా 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు ఆరు గేముల్లో గెలిచి, ఒక దానిని 'డ్రా' చేసుకొని చివరి రెండు రౌండ్‌లలో ఓడిపోయాడు.

దీంతో లలిత్ బాబు 6.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్ ఆటగాడు హర్ష భరతకోటి 4.5 పాయింట్లతో 38వ ర్యాంక్‌లో నిలిచాడు. హూగెవీన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో వరుసగా రెండోసారి అగ్రస్ధానంలో నిలవడంపై అభిజిత్ గుప్తా సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకిది అత్యుత్తమైన ప్రదర్శన అని చెప్పాడు. ఈ అంతర్జాతీయ ఓపెన్‌లో ఇప్పటిదాకా ఎవరూ వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గలేకపోయారుని, ఆలాంటిది తాను సాధించినందుకు గర్వంగా ఉందని అభిజిత్ గుప్తా తెలిపాడు.