
హైదరాబాద్: మరో అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు సత్తా చాటారు. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ స్వర్ణాన్ని దక్కించుకుని సత్తా చాటింది. ఇంటర్నేషనల్ సిలెసియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోటీల్లో మేరీకోమ్‌తో పాటు మరో బాక్సర్‌కు పసిడి లభించింది. పోలెండ్‌లోని గ్లివైస్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ బాక్సర్లు అదరగొడుతున్నారు.
మేరికోమ్‌కి ఈ ఏడాది ఇది మూడో స్వర్ణం. ఇప్పటికే ఇండియా ఓపెన్, గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు గెలిచింది మేరీకోమ్. ఇప్పటికే టీమిండియా ఖాతాలో 13 మెడల్స్ చేరడం విశేషం. వాటిల్లో ఆరు స్వర్ణాలున్నాయి. 48 కిలోల కేటగిరిలో శనివారం జరిగిన ఫైనల్‌లో కజకిస్థాన్ బాక్సర్ ఐజెరిమ్ కస్సనయెవాతో తలపడిన మేరికోమ్ 5-0 తేడాతో చిత్తు చేసి గోల్డ్ కైవసం చేసుకుంది. మేరికోమ్‌తో పాటు జ్యోతి గులియా 51 కేజీల కేటగిరిలో స్వర్ణం సాధించింది.
సెమీఫైనల్ చేరిన మరో బాక్సర్ సరితా దేవి 60 కేజీల కేటగిరిలో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. కజకిస్థాన్ బాక్సర్ కరినా ఇబ్రాగిమోవాతో 0-5 చిత్తుగా ఓడింది సరితా దేవి. అయితే తన ఓటమిని అంగీకరించలేదు సరితా దేవి. అంపైర్ల తప్పుడు నిర్ణయం కారణంగానే సరితా దేవి ఓడిపోయిందని ఆమె టీం కోచ్ ఆరోపించారు. యూత్ కాంపీటీషన్స్‌లో జ్యతి గులియా పోలాండ్‌కి చెందిన తాతియానా పుల్టాను రెండు రౌండ్లలో చిత్తుగా ఓడించి గోల్డ్ సాధించింది.
పోలెండ్ బ్యాక్సర్‌పై పూర్తి ఆధిపత్యం కనబర్చిన 17 ఏళ్ల జ్యోతిగులియా కొద్దిసేపట్లోనే మట్టికరిపించింది. సెమీస్ చేరిన భారత బాక్సర్లు లోవ్‌లినా బోర్గోహెయిన్, పూజా రాణి... ఫైనల్ చేరడంలో విఫలమై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. లోవ్‌లినా ఓటమికి కూడా అంపైర్ల తప్పుడు నిర్ణయమే కారణమని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.