న్యూఢిల్లీ: సాకర్ ప్రపంచ కప్ పోటీలకు గోవా ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలను పంపిస్తున్న విషయంలో వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాము తమ సొంత డబ్బులతో బ్రెజిల్ వెళ్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు గోవాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ నెలాఖర్లో బ్రెజిల్‌కు వెళ్లనున్నారు. ఇందుకోసం మనోహర్ పారికర్ సర్కారు రూ.89 లక్షలు మంజూరు చేసింది.
దీనిపై గోవా కాంగ్రెస్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని నేతల పర్యటనకు వెచ్చిస్తున్నారని, ఇందులో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరుతూ ప్రధానిమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. దీనిపై గోవా మత్స్యశాఖ మంత్రి అవెర్టానో పుటాడో స్పందించారు. తాము సొంత ఖర్చులతోనే బ్రెజిల్ వెళ్తామని, ప్రభుత్వ సొమ్మును వినియోగించుకోమని చెప్పారు.

కాగా,ప్రభుత్వవ్యయంతో మంత్రులు, ఎమ్మెల్యేలను ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు బ్రెజిల్‌కు పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని గోవా సీఎం మనోహర్ పారికర్ సమర్థించుకున్నారు. దీన్ని ఖర్చు కింద కాకుండా పెట్టుబడిలా చూస్తున్నామన్నారు.
ప్రజాధనంతో బ్రెజిల్‌కు పంపనుండడంపై గోవా కాంగ్రెస్ నేతలు మోడీకి లేఖ రాసిన నేపథ్యంలో పారికర్ స్పందించారు. ఇందులో తప్పేం లేదన్నారు. తమ రాష్ట్ర క్రీడగా ఫుట్‌బాల్‌ను ప్రకటించామని, ఆ ఆటను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను, కావాల్సిన వసతులను పరిశీలించేందుకు మంత్రుల పర్యటన తోడ్పడుతుందని చెప్పారు.