హైదరాబాద్: డ్రెస్ బాగోలేదన్న కారణంతో 12 ఏళ్ల చెస్ క్రీడాకారిణిని ఆట మధ్యలో నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆ క్రీడాకారిణి టోర్నీ నుంచే వైదొలగాల్సి వచ్చింది. మలేసియాలోని 'నేషనల్ స్కాలాస్టిక్ చెస్ ఛాంపియన్‌షిప్'లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మలేసియాలో ఏప్రిల్ 14 నుంచి 16వరకు నేషనల్ స్కాలాస్టిక్ చెస్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఈ పోటీల్లో 12 ఏళ్ల క్రీడాకారిణి మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్ వేసుకుని పాల్గొంది. 'నీ డ్రెస్ బాగాలేదు. రెచ్చగొట్టేలావుంది. నువ్వు వైదొలగాలి' అని ఆమెను టోర్నీ మధ్యలో నుంచి బయటకు పంపించేశారు.
దాంతో ఆ క్రీడాకారిణి నిశ్చేష్టురాలైంది. ఈ ఘటనను బాలిక కోచ్ కౌశల్ కాందహార్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కౌలాలంపూర్ రీజనల్ చాంపియన్ అయిన ఆ బాలిక రెండో రౌండ్ గేమ్ మధ్యలో ఉండగా మోకాలి దాకా ఉన్న బాలిక డ్రెస్‌పై టోర్నీ డైరెక్టర్ అభ్యంతరం ప్రకటించాడు.
తొలి రౌండ్‌లో చీఫ్ ఆర్బిటర్ ఆమె డ్రెస్‌పై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అయితే రెండోరౌండ్ గేమ్ ఆడుతుండగా మధ్యలోనే ఆమెను బయటకు పంపించేశారు. అంతేకాదు వేరే డ్రెస్ కొనుక్కొని తర్వాతి రోజు టోర్నీకి రమ్మని చెప్పారు. అయితే అప్పటికే రాత్రి 10 గంటలు దాటింది. దుకాణాలన్నీ మూసేశారు.
ఆ తర్వాత రోజు 9 గంటలకే టోర్నీకి రమ్మన్నారు. అప్పటికీ దుకాణాలను తెరవరు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో ఆ బాలిక టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చిందని కోచ్ కౌశల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. సాధారణంగా చెస్‌లో హుందాగా ఉండే డ్రెస్‌కోడ్‌తో రావాలనే నిబంధన మాత్రమే ఉంటుందని అన్నారు.
నిజానికి మలేసియాలో మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్‌లను హుందాగానే పరిగణిస్తారు. టోర్నీకి ముందే డ్రెస్‌కోడ్ నిర్ధారించకుండా ఇలా అవమానకరంగా వ్యవహరించడంపై ఆ క్రీడాకారిణి తల్లి ఆగ్రహం వ్యక్తంచేసింది.