
ముంబై: భారత స్టార్ రెజ్లర్ గీతా ఫొగట్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం గీత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుస్తీ దంపతులు గీతా ఫొగాట్, పవన్ కుమార్ ఆనందంలో తేలియాడుతున్నారు. ఈ విషయాన్ని గీత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. భర్త పవన్, బిడ్డతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేసి.. బుల్లి కుస్తీ వీరుడొచ్చాడు అని రాసికొచ్చింది.
'హల్లో బాయ్. ఈ ప్రపంచానికి స్వాగతం. అతనొచ్చేశాడు. మేం చాలా ప్రేమలో మునిగిపోయాం. మా చిన్నారికి దయచేసి మీ ప్రేమ, ఆశీర్వాదాలను అందించండి. అతడు మా జీవితాలను పరిపూర్ణం చేశాడు. బిడ్డకు జన్మనివ్వడం కన్నా.. మెరుగైన అనుభూతి ఇంకేం ఉండదు' అని గీతా ఫొగట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అభిమానులు, సన్నిహితుల నుండి గీత-పవన్ దంపతులకు అభినందనలు వెల్లువెత్తాయి. గీతా ఫొగట్ సోదరి, రెజ్లర్ బబిత వారికి శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు చిన్నారితో తీసుకున్న ఓ ఫొటోను ట్వీట్ చేసింది. 'గీతా సోదరికి అభినందనలు. మీకు ఆనందం, వినోదం, నవ్వు, ప్రేమ జీవితాంతం కలగాలని కోరుకుంటున్నా. అతను జీవితంలో వేసే ప్రతి అడుగులో విజయం కలగాలి. ఈ అందమైన శిశువుతో మీ కొత్త వారసత్వాన్ని కొనసాగించండి' అని ట్వీట్ చేసింది.
2010 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం అందుకున్న తొలి భారత రెజ్లర్‌గా గీతా ఫొగట్ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కెనడాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించింది. గీతా కుటుంబ సభ్యులంతా రెజ్లింగ్‌కే అంకితమవ్వడం గమనార్హం. మహావీర్ సింగ్ ఫోగట్, గీతా ఫొగట్, బబిత ఫొగట్‌లపై సినిమా వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో 'అమిర్ ఖాన్' మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.