
హైదరాబాద్: పరుగుల వీరుడు, పలు సార్లు ఒలింపిక్స్‌లో టైటిల్‌ని గెలుచుకున్న విజేత అయిన గట్లిన్‌పై డ్రగ్స్ తీసుకుంటున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో
యునైటెడ్ స్టేట్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (యూఎస్ఏడీఏ)తో పాటు అథ్లెటిక్స్ ఇంటిగ్రెటీ
అతనిపై మిగిలిన బృందంపై విచారణ జరపనుంది.
గట్లిన్‌ను 100మీటర్లు పరుగు పందెంలో పాల్గొంటున్న నేపథ్యంలో దానికి కావలసిన శిక్షణ కాకుండా డ్రగ్స్ తీసుకున్నాడని పలువురి వాదన. దానికి అతని బృందం సభ్యులే సహకారమందిస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరేమో అతనికి తెలియకుండా తప్పుడు మందులు ఇచ్చి అమెరికా పరుపు పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని కొట్టి పడేస్తున్నారు.
గట్లిన్ కోచ్ డెనిస్ మిచెల్, స్పోర్ట్స్ ఏజెంట్ అయిన రోబర్ట్ వాగ్నర్ లే ఫ్లోరిడాలో ఉన్న ట్రైనింగ్ క్యాంప్ లోని గట్లిన్ కు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా దొరికే డ్రగ్స్ చేరవేస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా రెండు లక్షల యాబై వేల డాలర్లు ఖర్చుపెడుతున్నారట. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ శరీరాన్ని ఉత్తేజానికి గురి చేసి అంతకుముందున్న శక్తిని రెట్టింపు చేస్తుంది.
ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న పరుగుల వీరుడు, ఒకప్పటి ఒలింపిక్ విజేత అలాంటి పనులు చేయడంటూ ఇంకొందరు అతన్ని సమర్థిస్తున్నారు. దీనికి స్పందించిన అంతర్జాతీయ క్రీడా సహకార సమితి (ఐఏఏఎఫ్) ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. తనకు ప్రతి క్రీడాకారుడి సత్తా ఏంటో తెలుసని డ్రగ్స్ తీసుకుంటే ఉన్నదానికంటే ఎక్కువ స్థాయిని ప్రదర్శిస్తారని తెలిపారు. విచారణ పూర్తయ్యాక నిజాలు తెలుస్తాయంటూ వివరణ ఇచ్చారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.