లడఖ్‌లోని గడ్డకట్టే మంచు పలకల మీద కొందరు అమ్మాయిలు స్కేటింగ్ నేర్చుకుంటుంటే.. 'ఇది మగపిల్లలు ఆడే ఆట, మీకెందుకు?' అని ప్రపంచం ప్రశ్నించింది. కానీ, అవే విమర్శలను జయించి, ఇవాళ భారత మహిళల ఐస్ హాకీ జట్టుకు మూలస్తంభంగా నిలిచిన ధీరవనిత పద్మ చోరోల్.ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో భాగంగా తెలంగాణ జట్టుపై 19-1తో లడఖ్ ఘనవిజయం సాధించగా, అందులో పద్మ హ్యాట్రిక్ గోల్స్‌తో విరుచుకుపడింది. ఈ సందర్భంగా ఆమె తన ప్రయాణంలోని ఒడిదుడుకులను మైఖేల్‌తో పంచుకున్నారు. ఆ స్ఫూర్తిదాయక కథనం మీకోసం..
ఒకప్పుడు సరైన షూస్ లేవు, చేతిలో స్టిక్స్ లేవు, కనీసం ఆడేందుకు ఒక మహిళా జట్టు కూడా లేదు. కానీ ఈరోజు భారత జెండాను అంతర్జాతీయ ఐస్ హాకీ వేదికలపై రెపరెపలాడిస్తున్నారు లడఖ్ మహిళలు. ఈ ప్రస్థానంలో మొదటి తరం క్రీడాకారిణిగా, ప్రస్తుతం లడఖ్ జట్టు అసిస్టెంట్ కెప్టెన్‌గా పద్మ చోరోల్ ఒక సజీవ సాక్ష్యం.

అరువు తెచ్చుకున్న స్టిక్స్‌తో ఆట మొదలు!
2016లో మొదటిసారి భారత మహిళల ఐస్ హాకీ జట్టు ఏర్పాటైనప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని పద్మ గుర్తుచేసుకున్నారు. "మాకు అసలు అంతర్జాతీయ ప్రమాణాలు ఎలా ఉంటాయో తెలియదు. అబ్బాయిల దగ్గర స్కేట్స్, స్టిక్స్ అరువుగా తీసుకుని ప్రాక్టీస్ చేసేవాళ్లం. నా పాదాల కంటే పెద్దవైన షూస్ వేసుకుని, నా ఎత్తు కంటే పొడవైన స్టిక్స్‌తో ఆడేదాన్ని. మొదటి ఏడాది చాలా కష్టంగా గడిచింది" అని ఆమె ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
సహజ మంచు నుంచి కృత్రిమ రింక్‌ల వరకు..
లడఖ్‌లో ఏడాదికి కేవలం రెండు నెలలు మాత్రమే సహజమైన మంచుపై ఆడే అవకాశం ఉంటుంది. కానీ అంతర్జాతీయ పోటీలు కృత్రిమ మంచు (Artificial Ice) మీద జరుగుతాయి. "తొలిసారి చైనీస్ తైపీలో ఆడినప్పుడు ఆ మంచు చాలా నునుపుగా, వేగంగా ఉంది. పడిపోతే కనీసం నిలబడటం కూడా కష్టమయ్యేది. కానీ మేము ఓడిపోతూనే పాఠాలు నేర్చుకున్నాం" అని పద్మ వివరించారు.
మలేషియాపై తొలి గెలుపు - ఆపై కాంస్యాల పంట
ఓటములే పునాదిగా భారత్ 2017లో మలేషియాపై తొలి అంతర్జాతీయ విజయాన్ని అందుకుంది. అది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
ఖరీదైన క్రీడ.. అండగా నిలిచిన ఒలింపియన్
ఐస్ హాకీ అంటే అత్యంత ఖరీదైన క్రీడ. ఒక్కో స్కేటింగ్ షూ జత ధర రూ. 1 లక్ష వరకు ఉంటుంది. స్టిక్ ధర రూ. 20-25 వేలు. 2018లో కెనడాకు చెందిన గ్రేటెస్ట్ ప్లేయర్ 'హేలీ వికెన్‌హైజర్' భారత అమ్మాయిల కష్టాలను చూసి, వారికి హెల్మెట్లు, చెస్ట్ గార్డులు, స్కేట్స్ వంటి వస్తువులను బహుమతిగా ఇచ్చారు. పద్మ ఇప్పటికీ అవే వస్తువులను వాడుతుండటం విశేషం.
లక్ష్యం: 2027 వరల్డ్ ఛాంపియన్‌షిప్
ప్రస్తుతం లడఖ్ ప్రభుత్వం, సాయ్ (SAI) నుంచి అందుతున్న మద్దతుతో ఐస్ హాకీ రూపురేఖలు మారుతున్నాయి. "ఇప్పుడు ఖేలో ఇండియాలో 7 మహిళా జట్లు పాల్గొంటున్నాయి. డెహ్రాడూన్, పుణె వంటి నగరాల్లో కృత్రిమ ఐస్ రింక్‌లు అందుబాటులోకి వచ్చాయి. మా తదుపరి లక్ష్యం 2027 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అవ్వడమే" అని పద్మ ధీమా వ్యక్తం చేశారు.