క్రీడాకారులకు ఇచ్చే ఖేల్ రత్న అవార్డులను గురువారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డబుల్ ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్ తో పాటు చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ సహా నలుగురు అథ్లెట్లను ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది. పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ప్రవీణ్ కుమార్‌లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. భారత్ లో క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డును అత్యున్నతమైన క్రీడా గౌరవంగా భావిస్తారు.
క్రీడా మంత్రిత్వ శాఖ అర్జున అవార్డుల కోసం 17 మంది పారా అథ్లెట్లతో సహా 32 మంది అథ్లెట్లను ఎంపిక చేసింది. ఇటీవల ఖేల్ రత్నకు సిఫార్సు చేసిన అథ్లెట్ల జాబితాలో మను బాకర్ పేరు లేదని కొన్ని వార్తా నివేదికలు పేర్కొనడంతో పెద్ద దుమారం చెలరేగింది. మను తండ్రి రామ్ కిషన్, కోచ్ జస్పాల్ రాణా స్నబ్‌పై మండిపడ్డారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో తన తప్పు జరిగి ఉండవచ్చని మను భాకర్ పేర్కొంది.

22 ఏళ్ల మను భాకర్ ఆగస్టులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో కాంస్య విజేత ప్రదర్శనతో ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి ఇండియన్ అథ్లెట్‌గా నిలిచారు. అదే గేమ్స్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించింది. ఇక 18 ఏళ్ల గుకేశ్ గత ఏడాది చెస్ ఒలింపియాడ్‌లో చారిత్రాత్మక స్వర్ణం సాధించాడు.
అవార్డ్ గ్రహీతలకు రాష్ట్రపతి భవన్‌లో 17 జనవరి, 2025 (శుక్రవారం) ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ఇవ్వనున్నారు.