లండన్: చైనీస్ గ్రాండ్ ప్రీ గెలిచిన అనంతరం బ్రిటన్ ఫార్ములా వన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సంబరాలు శృతి మించాయి. అతను ఓ అమ్మాయి పైన షాంపేన్ను పోశాడు. దీంతో ఆమె ఇబ్బందికి గురైంది. దీని పైన పెద్ద ఎథ్తున విమర్శలు వచ్చాయి. దీంతో హామిల్టన్ దీనిపై క్షమాపణలు కోరారు.
సాధారణంగా ఎవరైనా గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటారు. ఇక ఫార్ములా వన్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఫార్ములా వన్ డ్రైవర్లు తాము గెలిచిన అనంతరం పోడియంపై షాంపేన్ బాటిళ్లతో సంబరాలు చేసుకుంటారు.
అయితే, చైనా గ్రాండ్ ప్రీ తర్వాత హామిల్టన్ సంబరం శృతి మించింది. పక్కనే నిలుచున్న గ్రిడ్ గర్ల్ ముఖంపై అతను షాంపేన్ చిమ్మాడు. ఆమె అసౌకర్యానికి లోనైంది. అయినా హామిల్టన్ పట్టించుకోలేదు. దీని పైన సామాజిక అనుసంధాన వేదికలలో విమర్శలు వెల్లువెత్తాయి. హామిల్టన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో హామిల్టన్ దిగి వచ్చారు. చైనీస్ గ్రాండ్ ప్రీ అనంతరం తన చర్యకు క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు. కాగా, ఆ సమయంలో హామిల్టన్ గ్రిడ్ గర్ల్ పైన షాంపేన్ చిమ్మి సంబరాలు చేసుకుంటుండగా ఫోటోలు తీశారు. మిగతా డ్రైవర్లు మాత్రం తమంత తాము సంబరాలు చేసుకోవడం గమనార్హం.