
భువనేశ్వర్: జూలై 23 నుంచి జరగబోయే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో 100 మీటర్ల రేసుపై దృష్టి సారించనున్నట్లు ఏస్ ఇండియన్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ తెలిపారు. 200 మీటర్ల రేసు కోసం సిద్ధం కావడానికి తనకు తగినంత సమయం లేనందునే.. 100 మీటర్ల పరుగుపై ఎక్కువ దృష్టి పెట్టానని స్పష్టం చేశారు. మెగా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడమే తన లక్ష్యమని ద్యుతీ చంద్ చెప్పారు. ఒలింపిక్స్ పతకం కోసం తాను రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రపంచ ర్యాంకింగ్స్ కోటా ద్వారా ద్యుతీ చంద్‌కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కిన విషయం తెలిసిందే. ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో 100 మీ, 200 మీ విభాగంలో ఆమె బెర్త్ ఖాయం చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పోటీల్లో 22 ఖాళీలు ఉండగా, 200 మీటర్ల పరుగు పందెంలో 15 ఖాళీలు ఉన్నాయి. 100 మీటర్ల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న ద్యుతీ.. 200 మీటర్ల విభాగంలో 51వ స్థానంలో ఉన్నారు. ఇటీవల పటియాలాలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్-4లో ఆటోమేటిక్ ఒలింపిక్ అర్హత సమయాన్ని 0.02 సెకన్ల తేడాతో ఆమె కోల్పోయారు.
తాజాగా ఓ జాతీయ మీడియాతో ద్యుతీ చంద్ మాట్లాడుతూ... 'టోక్యో ఒలింపిక్స్ 200 మీటర్ల రేసు కోసం సిద్ధం కావడానికి తగినంత సమయం లేనందున 100 మీటర్ల పరుగుపై ఎక్కువ దృష్టి పెట్టా. ఈసారి 100 మీటర్లపైనే నా పూర్తి దృష్టి ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా పరిమితులు ఉన్నాయి. అయితే నేను నా శిక్షణ మరియు పోటీలపై దృష్టి పెడతాను. గతంలో అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీ పడినందున నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీ పడుతున్నామంటే ఎంతో ఉత్సాహం వస్తుంది' అని అన్నారు.
'ప్రపంచ ర్యాంకింగ్స్ కోటా ద్వారా 100 మీ, 200 మీ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు గర్వంగా మరియు సంతోషంగా ఉన్నా. నా శిక్షకులకు కృతజ్ఞతలు. నేను ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన ఇస్తాను. మెగా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడమే నా మొదటి లక్ష్యం. నా అనుభవం అందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. నా శిక్షణ చాలా చక్కగా సాగుతోంది. ఉదయం 6 నుండి 10 వరకు, ఉదయం 11 నుండి 12 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాను. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మరోసారి సాధన చేస్తా. మొత్తంగా రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ఒలింపిక్స్‌లో విజయం సాధిస్తే ఆ ఘనతంతా సాయ్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు చెందుతుంది' అని ద్యుతీ చంద్ పేర్కొన్నారు.