మనీలా: బాక్సింగ్ యోధులు మానీ పకియావ్, ఫ్లాయిడ్ మేవేదర్ మధ్య జరిగిన ఫైట్.. ఫైట్ ఆఫ్ ది సెంచరీ అని చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఫైట్ బూటకమని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని అభిమానులు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బాక్సింగ్ పోటీ అంతా మోసమని అమెరికాలోని లక్షలాది మంది బాక్సింగ్ అభిమానులు, వారి తరఫు లాయర్లు అంటూ తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తుండడంతో ఈ పోటీ ఇప్పుడు కోర్టు వివాదంగా మారుతోంది.
పోటీ జరగడానికి ముందే పకియావ్ తన భుజానికి తగిలిన గాయం గురించి తన అభిమానులకు వెల్లడించాల్సిందని వివిధ కోర్టుల్లో దాఖలయిన దాదాపు 32 పిటిషన్లు ఆరోపిస్తున్నాయి.

నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితంగా ఈ పోటీ ఉంటుందని అభిమానులంతా ఎంతో ఎదురుచూడగా, చప్పగా, ఎలాంటి ఉత్సాహం, ఉత్కంఠా లేని విధంగా ఈ పోటీ జరగడం, 12 రౌండ్ల పోటీ ముగిసిన తర్వాత జడ్జీలు ఏకగ్రీవంగా మేవెదర్ విజయం సాధించినట్లు ప్రకటించడం తెలిసిందే.
ఇది ఫైట్ ఆఫ్ సెంచరీ కాదని, నిజం చెప్పాలంటే ఫ్రాడ్ ఆఫ్ ది సెంచరీ లాగా ఉందని ఓ పిటిషన్‌లో ఆరోపించారు. పకియావ్, అతని ప్రమోటర్ల చర్యలు డబ్బులు దోచుకోవడం తప్ప మరోటి కాదని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఫైట్స్ బీర్ బార్ తరఫున దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు.
ఈ పోటీని ప్రసారం చేయడానికి ఆ బార్ 2,600 డాలర్లు చెల్లించింది. కాగా, ఈ ఫైట్‌తో అభిమానులు, ప్రజలు అప్ సెట్ అయితే దానికి పకియావ్ కారణమని మేవేదర్ అన్నాడు.