
హైదరాబాద్: ప్రస్తుతం పురుషులకు సమానంగా అన్ని రంగాలలో ముందుకు దూసుకువెళ్తూ మహిళలు తమ శక్తిని చాటుతున్నారు. విద్య, వైద్య, రాజకీయం, క్రీడా.. ఏదైనా మహిళలు రాణిస్తున్నారు. తాజాగా ఓ మహిళ అద్భుతమే చేసింది. స్ఫూర్తిగొలిపే పరుగు పెట్టింది. 10 కిలోమీటర్లు పరుగును 62 నిమిషాల్లో పూర్తి చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ మహిళ ఐదు నెలల గర్భవతి. ఆ మహిళే బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల అంకిత గౌర్. బెంగళూర్ సీటిలో జరిగే పరుగు పోటీల్లో తొమ్మిదేళ్లుగా ఈమె పాల్గొంటూనే ఉంది.
వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అంకిత గౌర్ గత తొమ్మిదేళ్లుగా బెంగళూర్ సీటిలో జరిగే పరుగు పోటీల్లో పాల్గొంటూనే ఉంది. ఇక టీసీఎస్ 10కే రన్‌లో 2013 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా పోటీ పడుతూనే ఉంది. ఇందులో విశేషం లేదు. కానీ ఇప్పుడామె 5 నెలల గర్భవతి. మరో నాలుగు నెలల్లో అంకిత తల్లి కానుంది. అయినా సరే తనకిష్టమైన పరుగు కోసం తన గైనకాలజిస్టును సంప్రదించి మరీ పోటీపడింది. ఆదివారం జరిగిన పోటీలో ఇద్దరిగా బరిలోకి దిగి పూర్తి చేయడం విశేషం.
పరుగు పోటీపై అంకిత మాట్లాడుతూ... 'గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ పరుగు పెడుతూనే ఉన్నాను. నిత్యం నేను తీసుకునే శ్వాసలాగే నా జీవితంలో నేను పెట్టే పరుగు ఓ భాగం అయింది. 2013 నుంచి వరల్డ్ 10కె రన్‌లో పాల్గొంటున్నా. పతకాలు కూడా సాధించా. అయితే ఈసారి గర్భవతిని కావడంతో మధ్యలో కొన్ని నిమిషాలు బ్రేక్ తీసుకోవడంతో పాటు, అక్కడక్కడా నడిచి రన్‌ను పూర్తి చేశా' అని తెలిపింది.
ప్రతిరోజూ తాను రన్నింగ్ చేస్తూనే ఉంటానని చెప్పిన అంకిత.. ఐదు అంతర్జాతీయ మారథాన్‌లలోనూ పాల్గొన్నట్లు పేర్కొంది. బెర్లిన్‌లో మూడుసార్లు.. బోస్టన్, న్యూయార్క్ మారథాన్‌లలో ఒక్కోసారి పోటీపడినట్లు తెలిపింది. గతంలో టీసీఎస్ 10కేలోనూ పతకాలు గెలిచానని వివరించింది. ప్రస్తతం సోషల్ మీడియాలో అంకితపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'అంకిత సూపర్', 'అంకిత గ్రేట్' అంటూ పొగుడుతున్నారు.