పుణె: ఎట్టకేలకు ఎఫ్ సి గోవా జట్టు రెండో విజయాన్ని నమోదుచేసుకుంది. పుణెలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించి దిగువశ్రేణి స్థానం నుంచి ఒక మెట్టుపైకి ఎగబాకింది. ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ప్రారంభం నుంచి మనుగడకు ముప్పు ఏర్పడినా కోచ్ జికో సారధ్యంలో గోవా కుర్రాళ్లు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. బ్రెజిలియన్ స్ట్రయికర్ రాఫెల్ కొయెల్హో 32వ నిమిషంలో పంపిన ఫ్రీ కిక్ షాట్ నేరుగా బంతిని గోల్‌పోస్ట్‌కు చేరడంతో పుణెపై గోవా 1 - 0 స్కోర్ ఆధిక్యం సాధించింది.
టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత జట్టు విజయం సాధించడంతో జికో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో గోవా ఏడు పాయింట్లతో ఒక స్థానం పైకి ఎగబ్రాకితే, ఏడు మ్యాచ్‌లు ఆడిన పుణె జట్టు ఆరు పాయింట్లతో దిగువకు పడిపోయింది. ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్న జట్టులో జికో ఐదుగురిని మార్చేసి.. కొత్త రూపంలో టీంను రంగంలోకి దించాడు. జట్టును డిఫెన్సివ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగాడు. అందుకోసం ముగ్గురు ఇంటర్నేషనల్ ప్లేయర్లను బరిలోకి దించాడు.
లక్ష్మీకాంత్ కట్టిమణి, సంజయ్ బాల్ముచ్చు, రాబిన్ సింగ్‌లకు తిరిగి ఫస్ట్ జట్టులో చోటు దక్కింది. అటు పుణె కోచ్ ఆంటోనియో హబాస్ సైతం ముగ్గురిని మార్చేశాడు. గోవాపై ఏనాడూ ఓటమి పాలవ్వని హబాస్.. రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడిన డిఫెండర్ డి రావణన్ తోపాటు మరో ఇద్దరి స్థానాల్లో కొత్తవారికి చోటు కల్పించాడు. పుణె కుర్రాళ్లు సమర్థవంతంగా ఎడతెరిపి లేని అటాకింగ్ కొనసాగిస్తున్నా గోవా ప్లేయర్లు గట్టిగానే సమాధానమిచ్చారు. ప్రత్యేకించి రాఫెల్ కొయెల్హో వంటి వారు మిడ్ ఫీల్డ్‌లో ఆధిపత్యం వహిస్తూ ప్రత్యర్థులకు ప్రమాదకారులుగా కనిపించారు.

గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించినా పుణె గోల్స్ మాత్రం సాధించలేకపోయింది. 32వ నిమిషంలో కోయెల్హో ఫ్రీ కిక్ రూపంలో కొట్టిన షాట్‌తో బంతి చుట్టలు తిరుగుతూ నెట్‌లో చేరిపోయింది. బాక్స్ బయట ఉన్న అగస్టీన్ ఫెర్నాండెజ్‌ను జాఫ్రీ తప్పించిన తర్వాత కొయెల్హో గోల్‌తో గోవా జట్టుకు ఆధిక్యం తెచ్చిపెట్టాడు. అప్పటి నుంచి పుణె జట్టు గేమ్‌పై పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జీసస్ టాటూతో పలుసార్లు కార్నర్ నుంచి గోల్స్ చేయడానికి ప్రయత్నించినా గోవా గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి సేవ్ చేశాడు.
ఫస్టాఫ్ ముగింపుకు కొద్ది నిమిషాల ముందు స్కోర్ సమం చేసేందుకు పుణె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జొన్నాథన్ లుక్కా పంపిన లో షాట్‌ను కట్టిమణి తిప్పికొట్టాడు. ఆ తర్వాత మరో నిమిషానికి టాటూ పంపిన బంతిని కట్టిమణి అడ్డుకోగలిగాడు. దీంతో పుణె ఆధిపత్యం ప్రదర్శించినా గోవా మాత్రమే గోల్ చేయగలిగింది. ఫలితంగా ఫస్టాఫ్‌లో 1-0 స్కోర్ ఆధిక్యాన్ని గోవా కొనసాగించింది. సెకండాఫ్‌లోనూ ఇదే ఫ్యాషన్ కొనసాగింది. బంతిపై పట్టును కొనసాగిస్తూ పుణె ప్లేయర్ టాటూ లీడ్ చేయడానికి ప్రయత్నించాడు. గౌరమంగీసింగ్ కొట్టిన ఫ్రీ కిక్ షాట్ వైడ్‌గా మారి నెట్ దాటి వెళ్లిపోయింది.
పుణె అత్యధికంగా ఫార్వర్డ్ ఆటగాళ్లను ముందు నిలపడంతోనే గోవా గోల్ సాధించేందుకు మార్గం సుగమం అయ్యింది. 60వ నిమిషంలోనూ కొయెల్హో మరో గోల్ కు ప్రయత్నించాడు. కానీ బంతి నెట్ మీదుగా దూసుకెళ్లిపోయింది. ఇక గోవా కోచ్ జికో ప్రధానంగా మూడు పాయింట్లు సాధించడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించాడు. అందుకోసం రాజు గైక్వాడ్ స్థానే రాబిన్ సింగ్‌ను, రైనాల్డోకు బదులు జాఫ్రీని బరిలోకి దించాడు. ఇక పుణె కూడా మొమర్ డోయేను బరిలోకి దించింది. మార్పులు చేర్పుల తర్వాత మరోమారు పుణె అటాకర్ లుక్కా టాప్ కార్నర్ ద్వారా పంపిన ప్రీ కిక్ షాట్‌ను కట్టిమణి యధావిధిగా కట్టడి చేసి, జట్టును కాపాడుకోగలిగాడు. గోల్ కీపర్ ఎడెల్ బెటె వరకు వేగంగా దూసుకెళ్లి కొయెల్హో పంపిన బంతిని రాహుల్ భెకె డిఫెండర్‌గా అడ్డుకోవడంతో గోవా జట్టుకు డబుల్ గోల్స్ చేసే అవకాశం మిస్సయి వైడ్‌గా మారి వెళ్లిపోయింది.
పుణెపై గోవా జట్టు గొప్ప విజయం సాధించిందని కోచ్ జికో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండో విజయం సాధించడం సాధారణం కాదన్నాడు. కొయెల్హో తెలివిగా సాధించిన గోల్.. రెండు జట్ల మధ్య తేడాను స్పష్టంగా బయటపెట్టిందన్నాడు. చివరి క్షణంలో తాము సాధించిన విజయమని తెలిపాడు. తమకు చాలా అవకాశాలు వచ్చాయని, కానీ మ్యాచ్ లో తమ ఆటగాళ్ల పెర్పార్మెన్స్ ను అభినందిస్తున్నట్లు చెప్పాడు.
ఈ మ్యాచ్ పైనే తమ జట్టు భవితవ్యం ఆధార పడి ఉన్నదని జికో వ్యాఖ్యానించాడు. ప్రస్తుత సీజన్‌లో పుణెపై తొలి విజయం అని తెలిపాడు. పుణె చేసిన గోల్ ను రిఫరీ తిరస్కరించడం సరికాదని ఆ జట్టు కోచ్ అంటోనియో హబాస్ చేసిన ఫిర్యాదు సబబేనన్నాడు. తమ జట్టుపై రిఫరీలు పలుసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేసుకున్నాడు. తదుపరి గోవా జట్టు ఈ నెల ఎనిమిదో తేదీన కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుతో తలపడనున్నది.
తమ కుర్రాళ్లు వచ్చిన అవకాశాలను మిస్ చేసుకున్నందు వల్లే ఓటమి పాలయ్యామని పుణె కోచ్ అంటోనియో హబాస్ వ్యాఖ్యానించాడు. తమకు వచ్చిన పెనాల్టీ కార్నర్ పాయింట్ ను రిఫరీ తిరస్కరించారని ఫిర్యాదుచేశాడు. పుణె ప్లేయర్ జొన్నాథన్ లుక్కా మాట్లాడుతూ గోవాతో జరిగిన మ్యాచ్ చాలా గొప్పదని, సొంత గడ్డపై మ్యాచ్ ఓటమి పాలైనందుకు తమపై విశ్వాసం కోల్పోవద్దని పుణె వాసులను కోరాడు.