ముంబై: మాజీ క్రికెట్ సారథి కపిల్ దేవ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. కపిల్ దేవ్ సామ్కో (ఎస్ఏఎంసీఓ) వెంచర్ ఇండియన్ ట్రేడింగ్ లీగ్ (ఐటీఎల్)లో పెట్టుబడులు పెట్టాడు. ఫాంలో ఉన్నపుడు తన సిక్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించిన కపిల్ దేవ్ ఇప్పుడు ఈక్విటీస్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం గమనార్హం.
శామ్‌కో వెంచర్స్‌కు చెందిన ఇండియన్ ట్రేడింగ్ లీగ్(ఐటిఎల్) డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ. ఇండియన్ ట్రేడింగ్ లీగ్ (ఐటిఎల్), ఇండియన్ ఇన్వ్టెర్స్ లీగ్ (ఐఐఎల్), ఇండియన్ కమొడిటీస్ లీగ్ (ఐసిఎల్), ఇండియన్ ఉమెన్ లీగ్ (ఐడబ్ల్యుఎల్) పేరుతో మొత్తం నాలుగు ఫార్మాట్స్‌లో జరిగే ఈ సరికొత్త స్టాక్ మార్కెట్ గేమ్ ఫస్ట్ ఎడిషన్ ఈ నెల 19న ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మార్చి 31న ముగుస్తుంది.

రూ.25,000 పెట్టుబడితో ఇందులో పాల్గొనవచ్చు. తమ పెట్టుబడులపై అత్యధిక రాబడులు సాధించిన మదుపరులకు కోటి రూపాయలు బహుమతిగా ఇస్తారు.
తాను ఏ నిర్ణయమైనా మనస్ఫూర్తిగా ఇష్టపడే తీసుకుంటానని, ఈ ఐటీఎల్ మెదడుకు పదును పెట్టేదని, ఐపీఎల్, వండే మ్యాచ్‌లు అభిమానులను క్రికెట్‌కు ఎలా దగ్గరికి చేర్చాయో మనందరికీ తెలుసునని, శామ్‌కో డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ నిర్వహించే ఐటీఎల్ సైతం స్టాక్ మార్కెట్‌కు చెందిన ఇన్వెస్టర్లు, ట్రేడర్లను అలానే దగ్గరికి చేరుస్తుందని ఆశిస్తున్నానని కపిల్ చెప్పారు.
కపిల్ దేవ్ పెట్టుబడితో తమ డిస్కౌంట్ స్టాక్ బ్రోకింగ్ మరింత వేగంగా దూసుకు పోతుందని శామ్‌కో వెంచర్స్ సీఈవో జిమీత్ మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.