ఏలూరు: ఆంధ్రా క్రికెట్‌సంఘం (ఏసీఏ) మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాధ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ మొదలైంది. మహిళా క్రికెటర్లను చాముండి లైంగికంగా వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణ జరపాల్సిందిగా డీజీ రతన్ ను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో ఆయన విచారణ జరిపారు. సుమారు 12 మంది క్రీడాకారిణులను విచారించారు. వీరిలో తూర్పుగోదావరి, విశాఖపట్టణం, ఖమ్మం, విజయవాడతో పాటు పశ్చిమకు చెందిన నలుగురు క్రికెటర్లు పాల్గొన్నారు. ఉదయం 10కి ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. అయితే ఈ విచారణ జరుగుతున్నట్లు ఏసీఏ అనుబంధ సంఘమైన జిల్లా క్రికెట్ సంఘానికి కూడా తెలుపలేదు.
విచారణలో రాష్ట్ర జట్టుకు, జాతీయ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులపై చాముండేశ్వరినాథ్ ఏమైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా? లేదా? అనే విషయాలపై వారిని ఆరా తీశారు. అయితే వీరిలో అధిక శాతం మంది విశాఖపట్టణానికి చెందిన క్రీడాకారిణులు చాముండేశ్వరినాథ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తదుపరి విచారణ కోసం మహిళా క్రికెటర్లను హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం.