హైదరాబాద్: ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల షాట్‌పుట్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన మన్‌ప్రీత్ కౌర్ తన పతకాన్ని కోల్పోయింది.
ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ సందర్భంగా జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు పాటియాలాలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సేకరించిన 'ఎ' శాంపిల్‌ను పరీక్షించగా ఆమె డోపీగా తేలింది. నిషేధిత డైమిథైల్‌బుటిలమైన్ డ్రగ్ తీసుకున్నట్లు మన్‌ప్రీత్ యూరిన్ ఎ శాంపిల్స్‌లో రుజువైందని జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధికారి వెల్లడించారు.

అయితే తాజాగా 'బి' శాంపిల్ పరీక్షలోనూ ఆమె విఫలమైందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అడిల్లె సుమరివాల్ల తెలిపారు. మన్‌ప్రీత్ డోపీగా తేలడంతో ఆసియా అథ్లెటిక్స్ షాట్‌పుట్‌లో గెలిచిన స్వర్ణ పతాకాన్ని భారత్ కోల్పోయిందని ఆయన ప్రకటించారు.
దీంతో పాటు ఆగస్టు 5 నుంచి 13వ తేదీ వరకు లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆమె దూరమైనట్లు అధికారికంగా వెల్లడించారు. ఆమె తీసుకున్న డైమిథైల్‌బుటిలమైన్ డ్రగ్ గతంలో భారత అథ్లెట్లు ఎవరూ ఉపయోగించ లేదు.
చైనాలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రిలో షాట్‌పుట్ గుండును 18.86 మీటర్లు విసిరిన మన్‌ప్రీత్ స్వర్ణం నెగ్గడంతో పాటు జాతీయ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతోనే ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించింది.