Divya Deshmukh: జార్జియాలోని బటూమిలో జరిగిన ఫిడే ప్రపంచ కప్ 2025 ఫైనల్స్‌లో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ భారత చెస్ చరిత్రలో అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించింది. ఈ చారిత్రాత్మక విజయంతో కేవలం ఒక టైటిల్ గెలవడమే కాకుండా.. భారత మహిళా చెస్‌కు సరికొత్త దిశానిర్ధేశం చేసింది. దివ్య సాధించిన ఈ విజయం మహిళా చెస్ రంగంలో మరింత మంది యువ ప్రతిభావంతులకు స్ఫూర్తినిస్తుందని గ్రాండ్ మాస్టర్ ఆర్బీ రమేష్ అభిప్రాయపడ్డారు.
భారత చెస్ చరిత్రలో సరికొత్త రికార్డులు
దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 టైబ్రేకర్స్‌లో దిగ్గజ క్రీడాకారిణి కోనేరు హంపిని ఓడించి, ఈ టైటిల్‌ను గెలిచిన మొదటి భారతీయురాలిగా నిలిచింది. అంతే కాదు ఆమె దేశానికి 88వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ మహిళగా (కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి తర్వాత) ఆమె చరిత్ర సృష్టించింది.

ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తిగా భారతీయ క్రీడాకారిణుల మధ్య జరిగింది. ఇది భారతీయ చెస్ క్వీన్ కోనేరు హంపి, నాగ్‌పూర్ నుంచి వచ్చిన యువ ఛాలెంజర్ దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరిగింది. రాపిడ్ గేమ్స్‌లో ఒక డ్రా కాగా.. రెండో గేమ్‌లో దివ్య నల్లపావులతో అద్భుత విజయాన్ని సాధించింది. వరల్డ్ నంబర్ 5, ప్రస్తుత వరల్డ్ రాపిడ్ ఛాంపియన్ అయిన కోనేరు హంపి చేసిన చిన్న పొరపాట్లను దివ్య తెలివిగా ఉపయోగించుకుంది.
కోచ్ ఆర్బీ రమేష్ ప్రశంసల వర్షం
"దివ్య దేశ్‌ముఖ్ టాన్ జోంగ్‌యీ, హారిక, ఇప్పుడు హంపిని ఓడించింది. ఈ విజయం సాధించడానికి ఆమె అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించింది" అని ప్రపంచ చెస్‌లో అత్యంత గొప్ప కోచ్‌లలో ఒకరైన గ్రాండ్‌మాస్టర్ ఆర్‌బీ రమేష్ మైఖేల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అన్నారు. ఇంత చిన్న వయస్సులో ఈ విజయాన్ని సాధించడం నిజంగా అద్భుతమన్నారు. అనేక మంది భారతీయ చెస్ ప్రతిభావంతుల ఎదుగుదలను పర్యవేక్షించిన రమేష్.. దివ్యలో వచ్చిన మార్పు పట్ల గర్వం వ్యక్తం చేశారు. ఆమె ఇక కేవలం దూకుడుగా ఆడే క్రీడాకారిణి కాదన్నారు. ఆమె ఇప్పుడు పటిష్టమైన స్థానాలను ఆడుతోంది, ఎండ్‌గేమ్‌లను అన్వేషిస్తోందని చెప్పారు. ఒక యూనివర్సల్ ప్లేయర్‌గా మారుతోందని.. ఇది పరిపక్వతకు నిదర్శనమని కొనియాడారు.
ప్రైజ్ మనీ వివరాలు
ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా దివ్య దేశ్‌ముఖ్ 50,000 డాలర్లు (సుమారు ₹41.6 లక్షలు) ప్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపికి 35,000 డాలర్లు (సుమారు ₹29.1 లక్షలు) లభించాయి. అయితే ఓపెన్ విభాగంలో విజేతకు 110,000 డాలర్లు లభిస్తుండగా.. మహిళా విభాగంలో సగం కంటే తక్కువ ప్రైజ్ మనీ ఉండటం గమనార్హం.
ఒత్తిడిలో దివ్య ధైర్యం
"టై-బ్రేక్‌లో, ఆట ఏ వైపుకైనా వెళ్లి ఉండవచ్చు, ఎందుకంటే ఇద్దరూ మంచి ఆటగాళ్లు, చాలా అలసిపోయారు. ఎవరైనా కుప్పకూలి తప్పులు చేసే అవకాశం ఉందని రమేష్ వ్యాఖ్యానించారు. "కాబట్టి దివ్య తన ఆలోచనలను అదుపులో ఉంచుకుని, చివరి తప్పు చేయకపోవడం చాలా మంచి విషయం. అటువంటి పెద్ద టోర్నమెంట్‌లో, కీలకమైన ఆటలో ఇది చాలా ముఖ్యం." అని పేర్కొన్నారు. ఆమె విజయం భారత చెస్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు అని కోచ్ రమేష్ స్పష్టం చేశారు.
మహిళా చెస్‌కు దివ్య ఒక జ్యోతి
ఇంతకు ముందు కేవలం ముగ్గురు భారతీయ మహిళలు మాత్రమే గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సాధించారని.. ఇప్పుడు ఒక టీనేజర్ ఈ ఘనతను సాధించిందని కోచ్ రమేష్ వెల్లడించారు. ఇది ఒక కీలక క్షణమని.. కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదని, దేశంలో మహిళా చెస్‌కు ఒక జ్యోతిని వెలిగించిన క్షణమని ప్రశంసలు కురిపించారు. ఏళ్లుగా పురుషుల విభాగంలో గుకేష్, అర్జున్, ప్రజ్ఞానంద వంటి టీనేజ్ సంచలనాలను భారత్ తయారు చేసింది. అయితే రమేష్ చెప్పినట్లుగా, మహిళల విభాగంలో అలాంటి స్ఫూర్తి కనిపించలేదు. "ఈ విజయం ఆ పరిస్థితిని మార్చగలదు," అని ఆయన అన్నారు. ఇది ఎక్కువ మంది బాలికలను 18 ఏళ్లు నిండకముందే గ్రాండ్‌మాస్టర్‌లుగా మారాలని కలలు కనేలా ప్రోత్సహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అహ్మదాబాద్‌లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌గా నిలవడం నుంచి బుడాపెస్ట్‌లోని చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకానికి సహకరించడం వరకు, దివ్య ఎదుగుదల స్థిరంగా, అద్భుతంగా ఉంది. అయితే, బటూమి 2025 ఆమెకు ఒక పట్టాభిషేకం లాంటిది. ఒక ప్రపంచ కప్ ఛాంపియన్, ఒక గ్రాండ్‌మాస్టర్, ఒక టీనేజ్ ట్రెయిల్‌బ్లేజర్‌గా దివ్య దేశ్‌ముఖ్ కేవలం ఒక ట్రోఫీని గెలవడమే కాకుండా - కొత్త తలుపులను తెరిచింది.