అథ్లెటిక్స్ ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌కు వేళైంది. నేటి నుంచి ఈ మెగా ఈవెంట్ జరగనుంది. శుక్ర, శనివారాల్లో జరిగే ఈ పోటీల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోని 32 క్రీడాంశాల్లో ప్రపంచ అగ్రశ్రేణి అథ్లెట్లు పోటీ పడుతున్నారు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్టీపుల్‌ఛేజ్ అథ్లెట్ అవినాష్ సాబ్లే బరిలోకి దిగుతున్నారు. డైమండ్ లీగ్ ఫైనల్‌లో ఇద్దరు భారత అథ్లెట్లు పాల్గొనడం ఇదే తొలిసారి.
ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్ పసిడి లక్ష్యంతో రంగంలోకి దిగుతున్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్ వేదికగా జరిగిన 2022- ఫైనల్లో నీరజ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది అమెరికాలోని యూజీన్ వేదికగా జరిగిన 2023 డైమండ్ లీగ్‌లో అతను రన్నరప్‌గా నిలిచాడు. కాగా, ఈ ఏడాది డైమండ్ లీగ్ రెండు అంచె పోటీల్లోనే పాల్గొన్నప్పటికీ అతను 14 పాయింట్లతో టాప్-4లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. దోహా, లుపాన్ సిరీస్‌ల్లో పాల్గొన్నాడు.

ఈ ఏడాది మొత్తం 14 డైమండ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. తాము ఎంచుకున్న సిరీస్‌ల్లో పాల్గొనడం ద్వారా ఆటగాళ్లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. కాగా, నీరజ్ చోప్రా ఈవెంట్ శనివారం ఉంది. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈవెంట్ జరుగుతుంది. మరోవైపు అవినాశ్ సాబ్లే ఈవెంట్ ఇవాళ రాత్రి 12.30 గంటల నుంచి ప్రారంభం కానుంది.
అయితే అవినాశ్‌కు అదృష్టం కలిసొచ్చింది. రెండు అంచె పోటీల్లో పాల్గొన్న అవినాశ్ 14వ స్థానంలో నిలిచాడు. కానీ, అతనికంటే ముందున్న నలుగురు అథ్లెట్లు వేర్వేరు కారణాలతో ఫైనల్‌కు దూరమయ్యారు. దీంతో టాప్-12లో చోటుతో అవినాష్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించాడు. ఫైనల్‌లో 12 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో జాతీయ రికార్డు సాధించిన అవినాశ్ పారిస్ ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచి నిరాశపర్చిన సంగతి తెలిసిందే.