
భారత మెన్స్ డబుల్స్ జంట ధృవ్ కపిల, ఎంఆర్ అర్జున్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో మొదటి సెట్‌ను కోల్పోయిన వీరి జోడీ అద్భుత ఫామ్ పుంజుకుని చివరి రెండు సెట్లు గెలిచారు. ఈ మ్యాచ్‌లో 18-21, 21-15, 21-16 తేడాతో గెలుపొందారు. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా వీరు మెన్స్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. సింగపూర్‌కు చెందిన కేహెచ్ లోహ్, హెచ్ టెర్రీ జోడీ వీరికి చాలా టఫ్ పోటీనిచ్చింది. అయితే అర్జున్, ధ్రువ్ ఎడ్జ్ స్మాష్‌లు, పర్ ఫెక్ట్ డిఫెన్స్‌తో పైచేయి సాధించారు. తొలి గేమ్ కోల్పోయాక ఏమాత్రం నిరాశ పడకుండా వీరిద్దరి జోడీ కమ్ బ్యాక్ అయిన విధానం సూపర్బ్ అనే చెప్పాలి.
ఈ మ్యాచ్ గెలుపు అనంతరం ధృవ్ కపిల ఆనందంతో గెంతులేశాడు. ఇక అర్జున్ అయితే గ్రౌండ్‌పై ఒరిగి సంబరాలు చేసుకున్నాడు. ఇకపోతే క్వార్టర్ ఫైనల్లో వీరు.. ఇండోనేషియా జోడీ అయిన మహమ్మద్ అహ్సన్, హెండ్రా సెటియావాన్‌తో పోటీ పడనున్నారు. వీరు ఈ టోర్నీలో ఆద్యంతం మంచి ప్రదర్శన కనబర్చుతుండడంతో పతక ఆశలు రేపుతున్నారు. ఇకపోతే రెండో రౌండ్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఎనిమిదో సీడ్, గత ఎడిషన్‌లో కాంస్య పతక విజేతలైన కిమ్ ఆస్ట్రప్, అండర్స్ స్కారప్ రాస్ముస్సేన్‌లను అర్జున్, ధ్రువ్ జోడీ 21-17 21-16తో ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు సైనా నెహ్వాల్, పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి తమ ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో తలపడనున్నారు. అలాగే లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ రౌండ్ ఆఫ్ 16లో ఒకరితో ఒకరు తలపడనున్నారు.