
ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్ 2020లో సాధించిన రజత పతకాన్ని తన తండ్రికి అంకితమిస్తున్నానని భారత జావెలిన్ త్రో ఆటగాడు దేవేంద్ర జజారియా తెలిపాడు. నాన్న ప్రోత్సాహమే లేకుంటే తాను మూడో పతకం గెలిచే వాడినే కాదన్నాడు. నాన్న కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని దేవేంద్ర జజారియా చెప్పాడు. క్రీడలకు బయల్దేరే ముందు, పతకం గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమతో మాట్లాడటం స్ఫూర్తినిచ్చిందన్నాడు. పారాలింపిక్స్ ఎఫ్46 విభాగంలో దేవేంద్ర జజారియా రజతం గెలిచిన సంగతి తెలిసిందే. అతడు జావెలిన్‌ను ఏకంగా 64.35 మీటర్లు విసిరి వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు నెలకొల్పాడు.
వరుసగా మూడో పారాలింపిక్స్ పతకం గెలిచేందుకు దేవేంద్ర జజారియా గతేడాది గాంధీనగర్ సాయ్ కేంద్రంలో శిక్షణ తీసుకున్నాడు. అప్పుడే తన తండ్రికి క్యాన్సర్ వచ్చిందని తెలియడంతో.. ఆందోళన పడ్డాడు. తండ్రి కోసం శిక్షణ మానేసి ఇంటికి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు నాన్న వద్దే ఉన్నాడు. అయితే దేశానికి మూడో పతకం తీసుకురావాలని తండ్రి మాట తీసుకున్నాడు. కొడుకును మళ్లీ సాయ్‌కి పంపించాడు. దురదృష్టవశాత్తు గతేడాది అక్టోబర్లో ఆయన కన్నుమూశారు. విశ్వ క్రీడలు వాయిదా పడడంతో జజారియా సన్నద్ధం అయ్యేందుకు సమయం దొరికింది. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అయితే శ్రీలంక ఆటగాడు మరింత దూరం ఈటెను విసరడంతో జజారియాకుట్రుటిలో స్వర్ణం మిస్ అయింది.
'పారాలింపిక్స్‌లో పతకం గెలవడం సంతోషంగా ఉంది. ఈ పతకం దేశ ప్రజలకు చెందుతుంది. కానీ నేనీ ఈ పతకాన్ని దివంగతులైన మా తండ్రి రామ్‌సింగ్ జజారియాకు అంకితమిస్తున్నా. ఆయనే పారాలింపిక్స్‌లో నేను మరో పతకం తేవాలని కోరుకున్నారు. నిజానికి ఆయన ప్రోత్సాహం లేకుంటే.. నేనిక్కడ ఉండేవాడినే కాదు. నేను మూడో పతకం గెలిచేందుకు కఠిన సాధన చేసేందుకు ఆయనే కృషి చేశారు. ఆయన కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది' అని దేవేంద్ర జజారియా తెలిపాడు.
'ఆటల్లో ఇవన్నీ సహజమే. ఎప్పుడూ ఒడుదొడుకులు ఉంటాయి. నేను అత్యుత్తమంగానే ఆడాను. వ్యక్తిగత రికార్డును మెరుగుపర్చుకున్నాను. కానీ లంక ఆటగాడు నాకన్నా మరింత మెరుగ్గా ఆడాడు' అని భారత జావెలిన్ త్రో ఆటగాడు జజారియా అన్నాడు. 'దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీ అభినందించారు. క్రీడాకారులు రాణించేలా దేశ ప్రధానే ప్రోత్సహించడాన్ని మించిన సంతోషం ఇంకోటి లేదు. మేం పారాలింపిక్స్‌కు బయల్దేరే ముందూ ఆయన మాతో మాట్లాడారు. ఇప్పుడూ ప్రేరణనిస్తున్నారు. ఇది దేశ క్రీడా రంగానికి మేలు చేస్తుంది' అని జజారియా చెప్పుకొచ్చాడు.
కాగా టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఓ కాంస్య పతకం సాధించి పతకాల పట్టికలో 25వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో చైనా 119 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రైఫిల్ షూటింగ్‌లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా.. టీటీలో భవీనా పటేల్, మెన్స్ హైజంప్ ఈవెంట్‌లో నిషద్ కుమార్, డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేశ్ కతునియా, జావెలిన్ త్రో ఎఫ్46లో దేవేంద్ర జాజారియా రజత పతకాలు సాధించారు. డిజేబిలిటీ క్లాసిఫికేషన్‌లో వినోద్ కుమార్ అనర్హుడిగా తేలాడు. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని పారాలింపిక్స్ 2020 నిర్వాహకులు రద్దు చేశారు.