
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ షెడ్యూలు ప్రకారం ఢిల్లీలో మార్చి 15 నుంచి 26 వరకు జరగాల్సి ఉంది. మార్చి నెలలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత టోర్నీని రెండు భాగాలుగా చేసి మే, జూన్ నెలల్లో నిర్వహించాలనుకున్నారు. మే 5 నుంచి 13 వరకు రైఫిల్-పిస్టల్ పోటీలు, జూన్ 2 నుంచి 9 వరకు షాట్‌గన్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.
కానీ.. కరోనా వ్యాప్తి ఇప్పటికీ తగ్గకపోగా.. పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచకప్‌ను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్), భారత షూటింగ్ సంఘం ప్రకటించాయి. 'కరోనా వైరస్ వల్ల ఢిల్లీ నిర్వాహక కమిటీకి రైఫిల్/పిస్టల్ మరియు షాట్‌గన్ ప్రపంచకప్‌లను రద్దు చేయక తప్పలేదు' అని ఐఎస్‌ఎస్‌ఎఫ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
బాకులో జూన్ 22న మొదలు కావాల్సిన కంబైండ్ ప్రపంచకప్‌ను కూడా రద్దు చేయాలని ఐఎస్‌ఎస్‌ఎఫ్ నిర్ణయించింది. 'అథ్లెట్లు, అధికారులు, సిబ్బంది.. ఆరోగ్యంగా, క్షేమంగా ఉండడమే ప్రధానం' అని భారత షూటింగ్ సంఘం చెప్పింది. డిల్లీలో షూటింగ్ ప్రపంచకప్‌ను రద్దు చేయాలని మూడుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన షూటర్ రాజ్మండ్ దెబెవెచ్ ఇప్పటికే డిమాండ్ చేశాడు. మ్యూనిచ్‌లో జూన్‌లో జరగాల్సిన ప్రపంచకప్ ఇంతకుముందే రద్దైన విషయం తెలిసిందే.